ఒక నెల గ్యాప్‌లో రెండు బడా చిత్రాలు బాక్స్ ఆఫీస్ పైకి దండయాత్ర చేశాయి. వాటిల్లో ఒకటి ప్రభాస్ నటించిన ‘సాహో’ కాగా, మరొకటి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఆగష్టు 30న ‘సాహో’ విడుదల కాగా, ఈ నెల 2న మెగాస్టార్ ‘సైరా’ రిలీజయ్యింది. రెండు సినిమాల బడ్జెట్ దాదాపు 600 కోట్లు ఉంటుంది. ఇంతటి భారీ బడ్జెట్ సినిమాలతో స్టార్ హీరోలు సందడిని తిలకించిన టాలీవుడ్ వచ్చే రెండు నెలల్లో చాలావరకు చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. దాదాపు డిసెంబర్ చివరి వారం వరకు ఒక్క పెద్ద సినిమా కూడా విడుదల కాదు.
‘రాగాల 24గంటల్లో’, ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘ఇద్దరిలోకం ఒకటే’, ‘రాహు’, ‘ఆవిరి’, ‘రాజు గారి గది3’, ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ఇలా మొత్తం డజనుకు పైగా చిన్న చిత్రాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో విడుదలకు క్యూ కట్టాయి. ఇక మాస్ రాజా రవితేజ నటించిన ‘డిస్కో రాజా’, బాలకృష్ణ సినిమా డిసెంబర్ 20న విడుదల అవుతుండటంతో.. అప్పటివరకు బాక్సాపీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. మరోవైపు సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, రజినీకాంత్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.