Online Loan Apps: లోన్‌ యాప్‌ కేసుల్లో తవ్వేకొద్ది బయటపడుతున్న నిజాలు.. కీలక నిందితుడు నాగరాజే..!

|

Jan 02, 2021 | 3:37 PM

Online Loan Apps: లోన్‌ యాప్‌ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసుల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్న కొద్ది రోజురోజుకు కీలక విషయంలో వెలుగులోకి వస్తున్నాయి...

Online Loan Apps: లోన్‌ యాప్‌ కేసుల్లో తవ్వేకొద్ది బయటపడుతున్న నిజాలు.. కీలక నిందితుడు నాగరాజే..!
Follow us on

Online Loan Apps: లోన్‌ యాప్‌ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసుల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్న కొద్ది రోజురోజుకు కీలక విషయంలో వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ మైక్రోఫైనాన్సింగ్‌ కు సంబంధించిన లోన్‌ యాప్స్‌ కేసుల్లో పట్టుబడ్డ నాగరాజే కీలక నిందితుడని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఢిల్లీలో పోలీసులకు పట్టుబడ్డ చైనీయుడు ల్యాంబో పలు కీలక విషయాలు వెల్లడించాడు. ముందుగా తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించినా.. పోలీసులు నిజాలను బయటకు తెప్పించారు. నాగరాజు, ల్యాంబోను కష్టడిలోకి తీసుకోవాలని నిర్ణయించిన దర్యాప్తు అధికారులు.. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు హైదరాబాద్‌ కంపెనీల హెడ్‌ మధుబాబు ద్వారా చైనీయులకు పరిచయం అయ్యాడు. దీంతో చైనీయులు బెంగళూరు, ఢిల్లీ కార్యాలయాలకు నాగరాజును ఇన్‌చార్జిగా నియమించారు. లోన్‌ యాప్స్‌తో పాటు కాల్‌ సెంటర్లు నిర్వహిండానికి నాలుగు కంపెనీలు ఏర్పాటు చేసిన చైనా మహిళ జెన్సిఫర్‌ వాటిలోని ఉద్యోగులకు డైరెక్టర్లుగా నియమించింది.

ఇదిలా ఉండగా, నలుగురు డైరెక్టర్లను కలిసిన నాగరాజుకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో నాగరాజు ఢిల్లీలో పది కరెంటు బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వీటి ఆధారంగా రెండు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. ఇలా లోన్‌ యాప్స్‌ కార్యకలాపాలను జోరుగా సాగించాడు నాగరాజు. మరో పక్క మధుబాబు పర్యవేక్షిస్తున్న హైదరాబాద్‌ కాల్‌ సెంటర్‌లకు మొత్తం డేటాను జెన్సీఫర్‌ చైనా నుంచే పంపేదని, ఈ డేటా ఆధారంగా మధుబాబు డిఫాల్టర్ల వివరాలు తెలుసుకుంటూ వీటిని టెలీకాలర్లకు షేర్‌ చేసి ఫోన్‌లు చేయిస్తుండేవాడని పోలీసుల విచారణలో తేలింది.

కాగా, హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరులలో ఉన్న కాల్‌ సెంటర్లలో ఉద్యోగులకు చైనీయులు నేరుగా జీతాలు చెల్లింకుండా హైదరాబాద్‌కు సంబంధించి ఫోకస్‌, ఢిల్లీలోని మెరీడియన్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారానే సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నట్లు తేలింది. ఈ రెండు సంస్థలను సంప్రదించి ఉద్యోగులు, కాల్‌ సెంటర్ల పూర్తి జాబితాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, బుధవారం పారిపోయేందుకు విమానాశ్రయంలో అధికారులకు చిక్కిన ల్యాంబో.. కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇలా నాగరాజును విచారిస్తున్న కొద్ది మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Online Loan App: రెచ్చిపోయిన ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు.. బంధువులకు మేసేజ్‌లు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..