Video: ఆఫీస్ వర్క్ మానేసి లైవ్ క్రికెట్.. బిగ్ స్క్రీన్‌పై అడ్డంగా బుక్కైన ఉద్యోగులు.. నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో!
South Africa vs Australia 3rd Test: స్టేడియం పక్కనే ఆఫీస్ ఉంటే క్రికెట్ అభిమానికి ఇంకేం కావాలి? పని చేస్తున్నట్టే మ్యాచ్ చూడొచ్చు. కానీ కేప్‌టౌన్‌లో ఇద్దరు ఉద్యోగులు చేసిన ఈ తెలివైన పని వారినే దొరికిపోయేలా చేసింది. స్టేడియం జెయింట్ స్క్రీన్‌పై లైవ్‌లో ప్రత్యక్షం కావడంతో బిజీగా ఉన్నట్టు నటించిన తీరు ఇప్పుడు నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.

South Africa vs Australia 3rd Test: క్రికెట్ పిచ్చి అంటే ఇదేనేమో. మ్యాచ్ జరుగుతుంటే పని మీద మనసు నిలవదు. ముఖ్యంగా ఆఫీస్ కిటికీలోంచి స్టేడియమే కనిపిస్తుంటే ఎవరు మాత్రం ఆగగలరు? దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఇద్దరు ఉద్యోగులు కూడా ఇలాగే ఆలోచించారు. కానీ వారి ఈ క్రికెట్ ప్రేమ కాస్తా వారిని ప్రపంచం ముందు దొరికిపోయేలా చేసింది.
ఘటన అక్టోబర్ 27న న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు, సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరుగుతోంది. స్టేడియంకు ఆనుకునే ఉన్న ఓ ఆఫీస్ భవనం నుంచి ఇద్దరు ఉద్యోగులు తమ డెస్కుల వద్ద కూర్చునే మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. పని చేస్తూనే కంటితో మ్యాచ్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపించారు.
అయితే స్టేడియం కెమెరామెన్ కన్ను వీరిపై పడింది. ఒక్కసారిగా వీరిద్దరి దృశ్యం మైదానంలోని జెయింట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమైంది. అంతే.. తాము వేలాది మంది ముందు లైవ్‌లో ఉన్నామని గ్రహించిన వెంటనే ఇద్దరి ముఖాల్లో కంగారు మొదలైంది. ఒక్క సెకనులోనే ఇద్దరూ తమ కంప్యూటర్ మానిటర్ల వైపు తిరిగిపోయారు. ఎంతో శ్రద్ధగా పని చేస్తున్నట్టు, ఇప్పుడే ఏదో అర్జెంట్ మెయిల్ వచ్చినట్టు నటించడం మొదలుపెట్టారు.
Caught red-handed 😭😭
#SAvAUS https://t.co/7nc8z4ZH4S
— FanCode (@FanCode) October 27, 2026
ఒక క్షణం క్రితం క్రికెట్‌ను చూస్తున్నవారు, మరుక్షణం పనిలో మునిగిపోయినట్టు మారిపోవడమే అందరినీ నవ్వించింది. ఈ సన్నివేశాన్ని చూస్తున్న కామెంటేటర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. చమత్కారంగా “సారీ బాయ్స్” అంటూ వారిని ఆటపట్టించారు. దీంతో స్టేడియం మొత్తం నవ్వులతో మార్మోగింది.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలోకి రాగానే క్షణాల్లో వైరల్ అయింది. ఆఫీస్ వేళల్లో దొంగచాటుగా మ్యాచ్ చూడటం ప్రతి క్రికెట్ అభిమానికి అనుభవమే. కానీ అలా చూస్తూ జెయింట్ స్క్రీన్‌పై దొరికిపోవడం మాత్రం అరుదు. అందుకే నెటిజన్లు “రిలేటబుల్ మూమెంట్” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మైదానంలో మాత్రం హోరాహోరీ పోరు నడిచింది. 1-1తో సమమైన మూడు టెస్టుల సిరీస్‌లో డిసైడర్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 82.3 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కేవలం ఒక్క పరుగు వెనుకంజలో ఉంది, చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. అంటే మ్యాచ్ అత్యంత ఉత్కంఠంగా మారిందన్నమాట. కానీ మ్యాచ్ కంటే ఈ ఇద్దరు ఉద్యోగుల హడావుడే ఎక్కువ హైలైట్ అయిందని చెప్పాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
