ఆందోళనలు కొనసాగించాలని విపక్షాలు తమను రెచ్ఛగొడుతున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణను పంజాబ్ రైతు సంఘాలు ఖండించాయి. అది సరికాదని, వ్యవసాయ బిల్లులపై తామే స్వచ్ఛందంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఈ సంఘాల నేతలు చెప్పారు. అసలు మేమే ఈ బిల్లులను చదివాం.. ఇందులోని అంశాలన్నీ రైతు వ్యతిరేకమైనవే అని వారన్నారు. వీటిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కార్పొరేట్లు మోదీపై ఒత్తిడి తెచ్చాయని వారు ఆరోపించారు. వీటిని ప్రధాని రద్దు చేయాలని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి రాష్ట్ర కార్యదర్శి శర్వన్ సింగ్ పాంథేర్ డిమాండ్ చేశారు. పంజాబ్ లో రైల్ రోకో ఆందోళనను ఈ నెల 29 వరకు పొడిగించినట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 28 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా గల రైతు సంఘాలు తమ ఆందోళనకు మద్దతునిస్తున్నాయని పాంథేర్ తెలిపారు. హర్యానాలోనూ పలు విపక్షాలు ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించాయన్నారు.