నిజామాబాద్‌లో దొంగ బాబా పాపం పండింది. గత కొంతకాలంగా పూసలగల్లీలో చిన్న పత్రిక నడిపిస్తూ పనిలోపనిగా భూత వైద్యం కూడా చేసేస్తున్నాడీ దొంగ బాబా. మెడిటేషన్‌తో అనారోగ్య సమస్యలు తీరుస్తానని మాయమాటలు చెబుతూ మహిళలను లొంగదీసుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఇటీవల అనారోగ్యంతో మెట్‌పల్లి కి చెందిన తల్లీ, కూతురు ఈ బాబా ను ఆశ్రయించారు. మాయమాటలు చెప్పి తల్లీకూతుళ్లను లోబర్చుకున్నాడీ ప్రబుద్ధుడు. వైద్యం పేరుతో గదిలోకి రాగానే మత్తు మందు ఇచ్చి వివస్త్రగా మార్చి లైంగికదాడికి పాల్పడేవాడని తెలుస్తోంది. మూడు నెలలుగా బాలికపై బాబా అత్యాచారం కొనసాగించాడు.
అయితే, కూతురికి కడుపునొప్పి రావడంతో బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక మూడు నెలల గర్భవతి అని వైద్యులు చెప్పడంతో దొంగబాబా అకృత్యం బయటపడింది. ఈ దారుణాన్ని తెలుసుకున్న మహిళా సంఘాలు, బాధితురాలి కుటుంబసభ్యులతో కలిసి ఈ ఉదయం బాబా కార్యాలయంకు వచ్చి దొంగబాబాను చితకబాదారు. దీంతో బాబా రోడ్డు పై పరుగులు పెట్టాడు. మొత్తానికి చిక్కిన బాబాను పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించిన పోలీసులు.. దొంగ బాబాను లోపలేశారు.