AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజాం కాలం నాటి డ్రైనేజ్‌ వ్యవస్థ భేష్‌!

ఆరున్నర దశాబ్దాలుగా పాలకులు నిర్లిప్తతే ప్రస్తుతం హైదరాబాద్‌ దుస్థితికి కారణం.. ప్రతీదానికి ఆసఫ్‌జాహీలను ఆడిపోసుకుంటాం కానీ.. నిజాం పాలకులు హైదరాబాద్‌ డ్రైనేజ్‌ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ద కనబరిచారు..

నిజాం కాలం నాటి డ్రైనేజ్‌ వ్యవస్థ భేష్‌!
Balu
|

Updated on: Oct 19, 2020 | 9:18 AM

Share

ఆరున్నర దశాబ్దాలుగా పాలకులు నిర్లిప్తతే ప్రస్తుతం హైదరాబాద్‌ దుస్థితికి కారణం.. ప్రతీదానికి ఆసఫ్‌జాహీలను ఆడిపోసుకుంటాం కానీ.. నిజాం పాలకులు హైదరాబాద్‌ డ్రైనేజ్‌ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ద కనబరిచారు.. గత కొన్ని రోజులుగా కురుసున్న వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలమయ్యింది కదా! కొన్ని ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి కదా! అయితే కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహిల కాలంలో హైదరాబాద్‌ నగరంలో ఏర్పడిన బస్తీలకు మాత్రం ఎలాంటి ప్రమాదమూ రాలేదు.. ఆ బస్తీలకు వరద ముప్పు అసలే లేదు.. కారణం నిజాం పాలకులు, ఇంజనీర్ల కృషే కారణమన్నది నిర్వివాదాంశం. చార్మినార్‌, మొఘల్‌పురా, ఖిల్వాట్‌, షాలిబండ, ఫతే దర్వాజా, పురాని హవేలి, నూర్‌ఖాన్‌బజార్‌, హుస్సేన్‌ఆలం, దూద్‌బౌలి, ఇంజిన్‌బౌలి, కోట్ల అలీజా, పత్తర్‌గట్టి, పంజేషా పంచ మొహల్లా, చంచల్‌గూడ, ఖాజీపురా, కార్వాన్‌, జియాగుడ, అఫ్జల్‌గంజ్‌, ఫీల్‌ఖానా, జుమేరాత్‌బజార్‌.. ఇక కొత్త బస్తీకి వస్తే నిజాంకాలంలో అభివృద్ధి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు, నల్లకుంట, శంకర్‌మఠ్‌, ఫీవర్‌హాస్పిటల్‌, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ ఇత్యాది ప్రాంతాలకు ఎలాంటి వరద ముప్పు సంభవించలేదు.. కారణం .. అప్పటి డ్రైనేజ్‌ వ్యవస్థనే! హైదరాబాద్‌ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ అప్పుడెప్పుడో నిజాంకాలంలో వేసిన డ్రైనేజ్‌నే ఇప్పటికీ చక్కగా పని చేస్తోంది.. వర్షం పడ్డ గంటలోపే నీరు డ్రైనేజ్‌ద్వారా వెళ్లిపోతుంది.. పైన పేర్కొన్న కొన్ని ప్రాంతాలలోని చెరువులు కబ్జాకు గురికావడం వల్ల కొంత ఇబ్బందుతులు తలెత్తాయంతే! పైగా సెల్లార్‌ కోసం కొంచెం లోతుగా వెళ్లిన అపార్ట్‌మెంట్లలోనే నీళ్లు వచ్చాయి తప్ప.. రోడ్డు లెవల్‌కు వున్న వాటికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. నల్లకుంట, బతుకమ్మకుంట, నాగమయ్యకుంటలు ఇప్పుడు లేవు.. అలాగే దూద్‌బౌలీ, ఇంజిన్‌బౌలి పేర్లయితే ఉన్నాయి కానీ అక్కడ బావులు లేవు.. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు అప్పటి నిజాం పాలకుడు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ తీవ్రంగా ఆవేదన చెందాడు.. వదరకు గురైన ప్రాంతాలను సందర్శించాడు.. గంగమ్మకు ప్రత్యేక ప్రార్థనలు చేశాడు.. ఆ తర్వాత సుప్రసిద్ధ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించాడు. హైదరాబాద్‌ నగరాన్ని వరదల నుంచి కాపాడాల్సిందిగా అభ్యర్థించాడు.. ఆయన హయాంలోనే హైదరాబాద్‌లో నీరు సాఫీగా వెళ్లడానికి డ్రైనేజ్‌ వ్యవస్థ ఏర్పాటయ్యింది.. మహబూబ్‌ అలీఖాన్‌ చనిపోయిన తర్వాత గద్దెనెక్కిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా నగరంలో మెరుగైన వసతులు కల్పించారు.. సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసి విశ్వశ్వరయ్య సూచనలను అమలు చేశారు. అప్పట్లోనే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థతో పాటు, వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటిపారుదల కోసం లైన్స్‌ ఏర్పాటు చేశారు.