Nivar Cyclone : ఏపీలో నివర్ తుఫాన్ బీభత్సం.. ఎడతెరపి లేని వర్షాలు..లక్షల ఎకరాల్లో పంట నీటిపాలు
ఓవైపు నివర్ తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతుంటే... అటు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.

నివర్ తుఫాను ఏపీలో బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేని వర్షాలతో పలు జిల్లాలను ముంచెత్తింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిపాలు చేసింది. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చింది. భారీ వరదలు ఎంతో మంది తమ సర్వశ్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది.
LIVE NEWS & UPDATES
-
నివర్ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన.. అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో అధికారులతో భేటీ
నివర్ తుపాన్ ఏరియల్ సర్వే అనంతరం సీఎం వైఎస్ జగన్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ అయ్యారు. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చిస్తున్నారు.
-
నివర్ తుఫాను ప్రళయం..జలాశయంలోని నీరంగా వృథాగా కిందకు పోతోంది
ఊహించని విధంగా కరుస్తున్న వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఊహించని విధంగా కరుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
-
-
నివార్ ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే…ఇటు సహాయక చర్యల్లో మంత్రులు
నివార్ ముంచిన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మేకపాటి
నివర్ తుఫాను దెబ్బకు అతలాకుతలమైన జిల్లాల్లో నెల్లూరు. వరదల ఉధృతికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. అటు సీఎం వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే చేస్తుంటే ఇటు మంత్రులు తమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని తన సొంత నియోజకర్గమైన ఆత్మకూరులో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించారు.
-
నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే…పంట నష్టం అంచనాలపై ఆరా..
ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే
నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే కొనసాగుతోంది. విజయవాడ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన తర్వాత తిరిగి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ చిత్తూరు జిల్లా అధికారులతో సమీక్ష చేస్తారు. పంట నష్టం అంచనాలపై నిన్ననే మంత్రివర్గ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. డిసెంబర్ 15 లోపు పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని, నెలాఖరుకు పరిహారాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాలను అందించాలని అధికారులను ఆదేశించారు.
-
చిత్తూరు జిల్లాను ముంచెత్తిన నివార్… ఎన్టీఆర్ లాశయం గేట్లు ఎత్తడంతో వరద నీటిలో చిక్కుకుపోయిన రైతు నాయకర్
నిండు కుండలా ఎన్టీఆర్ జలాశయం
చిత్తూరు జిల్లాను నివార్ ముంచేసింది. గంగాధర నెల్లూరు మండలం కుట్ర కోనలో నీవా నదిలో మధ్యలో కొందరు రైతులు చిక్కుకున్నారు. చిక్కుకుపోయిన రైతు దొరస్వామి నాయకర్ అని అధికారులు గుర్తించారు. ఎన్టీఆర్ జలాశయం గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలను వరద నీరు చుట్టేసింది. ఈ వరదలో నాయకర్ చిక్కుకుపోయారు.
-
-
పశ్చిమగోదావరి జిల్లా నివార్ ఎఫెక్ట్.. వర్షం నీటిలో పంట పొలాలు..భారీగా పంట నష్టం
నీట మునిగిన పశ్చిమగోదావరి జిల్లా
నివర్ తుఫాన్ ప్రభావం పశ్చిమగోదావరి జిల్లాపై అధికంగా పడింది. తుపాను ప్రభావంతో జనజీవనం స్తంభించడంతో పాటు భారీగా పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో 21వేల 234 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 20వేల58 హెక్టార్లలో వరి, 1149 హెక్టార్లలో పత్తి, 27 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం ఏర్పడింది. దాదాపు రూ.54కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
-
నివర్ తుఫాన్ ప్రళయం..జల ఖడ్గంలా మారిన ప్రవాహం..పించా జలాశయంకు వరద పోటు
వరద నీటిలో పంటలు
నివర్ తుఫాను ప్రళయం సృష్టిస్తోంది. జల ఖడ్గంలా మారి కట్టలను కోసేస్తోంది. కడప జిల్లాలో పించా జలాశయం కుడి కాలువ తెగిపోయింది. ప్రవాహ తీవ్రతకు మట్టి కట్ట కొట్టుకుపోయింది. భారీగా వరద నీరు దిగువకు పోటెత్తుతోంది. వరద ఉధృతికి పించా ప్రాజెక్టు కుడి కాలువ కోతకు గురైంది. వరద నీరు పోటెత్తడంతో మట్టి కట్ట కావడంతో.. తెగిపోయింది. జలాశయంలోని నీరంగా వృథాగా కిందకు పోతోంది. దీంతో.. ప్రాజెక్టు కింద పంటలు సాగు చేసే ప్రాంత మంతా నీటి మునిగింది. వరదలో పంట సామాగ్రి అంతా కొట్టుకుపోయింది.
-
ఏపీపై నివార్ ఎఫెక్ట్..126 మండలాల్లో కుండపోత వానలు.. నీట మునిగిన పంటలు..
నివార్ వర్ష బీభత్సం
ఆంధ్రప్రదేశ్ పై నివార్ తుఫాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఎడతెరపి లేని వానలతోపాటు ముసురు పట్టి చలిగాలులతో వణికించింది. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 126 మండలాల్లో కుండపోత వానలు కురిపించింది. 105 మండలాల్లోని 973 గ్రామాల్ని జలమయం చేసింది. 1400 కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతిన్నాయి. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో అత్యధికంగా విధ్వంసం కనిపించింది.
-
ఉప నదులు ఉప్పొంగడంతో ఉగ్రరూపం దాల్చిన పెన్నా.. తల్పగిరి రంగనాథ స్వామి పుణ్యక్షేత్రంలోకి వరద నీరు..
రంగనాథ స్వామి పుణ్యక్షేత్రంలోకి వరద నీరు
నివర్ తుపాను ప్రభావం వల్ల కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పించా, చెయ్యేరు, స్వర్ణముఖి నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో నెల్లూరు నగరంలోని తల్పగిరి రంగనాథ స్వామి పుణ్యక్షేత్రంలోకి వర్షం నీరు వచ్చి చేరింది.
-
ఏపీని భయపెడున్న మరో రెండు వాయుగుండాలు.. డిసెంబర్ 2న తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే ఛాన్స్..
ఏపీని వణికిస్తున్న వాయుగుండం
ఇప్పటికే నివర్ ఏపీని అతలాకుతలం చేస్తోంది. నివార్ చేసిన బీభత్సం మరిచిపోక ముందే.. బంగాళాఖాతంలో మరో రెండు వాయుగుండాలు భయపెడుతున్నాయి. ఈనెల 29న అల్పపీడనం.. వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. డిసెంబర్ 2న తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని వెల్లడించారు. వచ్చే నెల 4-10 తేదీల మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడనుంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
-
నెల్లూరు జిల్లాలో పెన్నమ్మ ఉగ్రరూపం.. ఎన్నడూ లేనంతగా సోమశిల జలాశయానికి వరద
నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలు
నెల్లూరు జిల్లాలో పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎన్నడూ లేనంతగా సోమశిల జలాశయానికి వరద వచ్చి చేరుతోంది. కడప, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలకు నది నిండుగా ప్రవహిస్తోంది. బీరాపేరు, బొగ్గేరు వాగులతో పాటు చిన్న వాగులు కూడా ఉధృతంగా ఉండటంతో పెన్నాలో ప్రవాహం మరింత పెరిగింది.
-
మరికాసేపట్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే..పదమూడింట 10 జిల్లాలపై నివర్ పడగ..
వరద ఎఫెక్ట్‌పై సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆ జిల్లాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. తుఫాను కారణంగా మూడు జిల్లాల్లో జరిగిన భారీ నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలిస్తారు.
Published On - Nov 28,2020 2:33 PM