ప్రభుత్వ నిధులతో పనిచేసే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) లో శ్రామిక శక్తి కొరతను తీర్చడానికి భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి అర్హత కలిగిన వైద్యులు, నర్సుల కోసం కొత్త వీసాను ప్రవేశపెట్టే ప్రణాళికలను యూకే ప్రభుత్వం గురువారం ధృవీకరించింది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఎన్నికల ప్రచార బాటలో “ఎన్‌హెచ్‌ఎస్ వీసా” గురించి సూచనలు చేశారు, ఇది గురువారం పార్లమెంటులో క్వీన్స్ ప్రసంగంలో భాగంగా నిర్ధారించబడింది. “నేషనల్ హెల్త్ సర్వీస్ యొక్క శ్రామిక శక్తిని పెంచడానికి చర్యలు తీసుకోబడతాయి. అర్హతగల వైద్యులు, నర్సులు, ఆరోగ్య నిపుణులు కొత్త వీసా తో యునైటెడ్ కింగ్‌డమ్‌లోకి ప్రవేశిస్తారు” అని ఆమె ప్రసంగం యొక్క సారాంశం.
ప్రపంచవ్యాప్తంగా తెలిమైన, ప్రతిభగల వారిని ఆకర్షించడానికి ఆస్ట్రేలియన్ తరహా పాయింట్ల-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను యూకే ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ “ఎన్‌హెచ్‌ఎస్ పీపుల్ ప్లాన్” క్రింద అర్హతగల వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు ఉద్యోగ ప్రతిపాదనతో గుర్తింపు పొందిన ప్రమాణాలకు అర్హత ఉన్న వారికి యూకే రావడానికి ఫాస్ట్ ట్రాక్ వీసా ఇవ్వబడుతుంది. వచ్చే ఏడాది బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఇయు) ను వీడనుంది. బ్రెక్సిట్ అనంతర కొత్త వీసా, ఇమ్మిగ్రేషన్ విధానం సరళంగా ఉంటుందని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొంది. యూరోపియన్ యూనియన్ యొక్క నిబంధనలు ఇకపై యూకేకి వర్తించవు.