New headache for congress high-command: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక పార్టీ అధిష్టానానికి కొత్త సమస్యగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అభిప్రాయ సేకరణకు వచ్చిన తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేస్తున్న కొందరు టీపీసీసీ ఆశావహులు ఆయనపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఢిల్లీకి సరైన సమాచారం అందడం లేదంటూ శనివారం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కాక రేపాయి.
గాంధీభవన్ వేదికగా జరిగిన అభిప్రాయ సేకరణ ముగిసిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో పది మందికి పైగా సీనియర్లు కనిపిస్తుండడం.. మరోవైపు పార్టీలో గత ఎన్నికలకు ముందు చేరిన ఓ నేత వైపు మొగ్గుచూపుతున్న సంకేతాలు కనిపిస్తుండడంతో పదవిని ఆశ్రయిస్తున్న మరికొందరు నేతలు పోలరైజ్ అవుతున్నారు. శనివారం కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య వంటి నేతలు హైదరాబాద్‌లో సమావేశమైన ఠాగూర్ వ్యవహార శైలిపై చర్చించారు.
ALSO READ: గజపతుల కోట టీడీపీలో ముసలం.. రాజావారికి చెక్ పెడుతున్న పార్టీ నేతలు
సమావేశం తర్వాత జగ్గారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి సరైన సమాచారం వెళ్ళడం లేదంటూనే పీసీసీ అధ్యక్షుని ఎంపిక సరిగ్గా జరక్కపోతే అందుకు ఠాగూర్, వేణుగోపాల్ వంటి పార్టీ ఇంఛార్జీలే బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. తమలో ఎవరికి పీసీసీ అధ్యక్ష పీఠం దక్కినా కలిసి పని చేయాలన్న అభిప్రాయానికి వచ్చిన శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, వెంకటరెడ్డిలు.. తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న మరో ఎంపీకి టీపీసీసీ పీఠం దక్కకుండా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. తదితరులు మరో రెండ్రోజుల్లో ఢిల్లీకి వెళ్ళనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆధివారం నాడు వెల్లడించాయి. మంగళవారం నాడు ఈ నేతలు ఢిల్లీకి వెళ్ళి పార్టీ అధినేతలను కలిసి అభిప్రాయ సేకరణ గురించి వివరిస్తారని వారు చెప్పుకుంటున్నారు. తొలి నుంచి పార్టీలో వుంటూ.. పార్టీకోసం పని చేసిన వారికే టీపీసీసీ పీఠం ఇవ్వాలని వారు అధిష్టానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. పోటా పోటీ సమావేశాలు.. మంతనాలు.. వ్యూహాలు.. వెరసి టీపీసీసీ అధ్యక్ష ఎంపిక అధిష్టానానికి కొత్త సమస్యగా మారినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడు?
మరోవైపు వారం రోజుల్లోనే తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్‌ను నియమిస్తారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన మాణిక్కం ఠాగూర్ ఢిల్లీ చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో వున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క, అంజనీకుమార్ యాదవ్ ఢిల్లీ యాత్రకు రెడీ అవుతున్నారు. ఇదివరకే ఢిల్లీకి చేరుకున్న మాజీ ఎంపీ, మాజీ ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ ఏఐసీసీ నేతలతో భేటికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఇటీవల కాలంలో చేరిన వారికి టీపీసీసీ పదవి ఇస్తే తాము పార్టీలో కొనసాగలేమని పలువురు పాత నేతలు ఖరాఖండీగా చెప్పేందుకే ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: గజపతుల కోట టీడీపీలో ముసలం.. రాజావారికి చెక్ పెడుతున్న పార్టీ నేతలు