ఏపీలో కలవరపెడుతున్న కొత్త వైరస్… ల్యాబ్ రిజల్ట్ కోసం వేచిచూస్తున్న అధికారులు..

|

Dec 28, 2020 | 6:59 AM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ కలవరపెడుతోంది. శనివారం వరకూ యూకే నుంచి తిరిగొచ్చిన 1,216 మందిని ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరిలో 1,187మంది ఆచూకీని గుర్తించిన అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

ఏపీలో కలవరపెడుతున్న కొత్త వైరస్... ల్యాబ్ రిజల్ట్ కోసం వేచిచూస్తున్న అధికారులు..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ కలవరపెడుతోంది. శనివారం వరకూ యూకే నుంచి తిరిగొచ్చిన 1,216 మందిని ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరిలో 1,187మంది ఆచూకీని గుర్తించిన అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే, కాంటాక్ట్ ట్రెసింగ్‌లో మరో 29 మంది జాడ తెలియాల్సి ఉంది. అందులో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. వీరినుంచి మరోసారి నమూనాలు తీసుకుని పుణె, బెంగళూరు ల్యాబ్‌లకు పంపించామన్నారు. ఈ ఆరుగురిలో గుంటూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

కాగా, యూకే నుంచి తిరిగి వచ్చిన వారితో కాంటాక్టులుగా 3,282 మందిని గుర్తించిన అధికారులు.. వారిని క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అయితే వీరిలో నలుగురికీ పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ముగ్గురు గుంటూరులో, ఒకరు నెల్లూరులో ఉన్నారు. మొత్తంగా కొత్త స్ర్టెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలో పదిమంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. అయితే, లండన్‌ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కనిపిస్తున్న లక్షణాలు కొత్త రకానివేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోనూ ముగ్గురికి ఇవే లక్షణాలు కనిపించాయి. ఇదిలావుంటే, వీరందరికీ కొత్త స్ట్రెయిన్‌ వైరస్ వ్యాప్తించా అన్న దానిపై రిపోర్టులు అందాక నిర్ధారిస్తామని అధికారులు చెబుతున్నారు.