కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవే

కడప–రేణిగుంట నాలుగు వరుసల హైవేకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి, చెన్నైలకు తక్కువ సమయంలోనే వెళ్లేందుకు కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవేను నిర్మించనున్నారు. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారి..

కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవే

Updated on: Oct 25, 2020 | 9:56 PM

Kadapa-Renigunta Four-Lane Highway : కడప–రేణిగుంట నాలుగు వరుసల హైవేకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి, చెన్నైలకు తక్కువ సమయంలోనే వెళ్లేందుకు కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవేను నిర్మించనున్నారు. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారి అయిన ఈ రోడ్డు ప్రస్తుతమున్న రెండు వరుసల నుంచి నాలుగు లేన్లుగా మార్చేందుకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పనులు వేగవంతం చేసింది.

త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ హైవేను కేంద్రం ఇటీవలే గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగా గుర్తించింది. ఈ మార్గంలో 3 వంతెనలు, 2 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీ కింద కడప జిల్లా సిద్ధవటం మండలం మొదలుకుని రైల్వేకోడూరు మండలం వరకు నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు.

భూ సేకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో ఈ హైవేకు ఎన్‌హెచ్‌–716 కేటాయించారు. ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చొరవతో ఎన్‌హెచ్‌ఏఐ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. కడప వద్ద వైఎస్సార్‌ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట వరకు 4 లేన్ల నిర్మాణం జరగనుంది. రూ.3 వేల కోట్లతో 133 కి.మీ. మేర నిర్మించనున్న ఈ హైవే నిర్మాణానికి కేంద్రం అంగీకరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేస్తోంది.

ఒక్క కడప జిల్లాలోనే సుమారు 100 కి.మీ. మేర రహదారి నిర్మించనున్నారు. దీనిని రెండు ప్యాకేజీలుగా విభజించి 1,068 ఎకరాలు సేకరించనున్నారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధమైంది. మొత్తం 138 కి.మీ. మేర రోడ్డు నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టనుంది.