పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం.. మౌలిక సదుపాయాలకల్పనలో దేశానికే ఆదర్శంః మంత్రి కేటీఆర్

|

Jan 23, 2021 | 9:22 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న సులభ వాణిజ్య విధానం వల్లే భారీగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి.

పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం.. మౌలిక సదుపాయాలకల్పనలో దేశానికే ఆదర్శంః మంత్రి కేటీఆర్
Follow us on

 ftcci excellence awards : పెట్టుబడులకు అనువైన రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న సులభ వాణిజ్య విధానం వల్లే రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దేశంలోనే తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవన్‌లో వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న మంత్రి.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, బెస్ట్‌ లివింగ్‌ సిటీ విభాగాల్లో హైదరాబాద్‌ అగ్రగామిగా నిలిచిందన్నారు. అన్ని విధాలుగా పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమన్నారు. టీఎస్‌ ఐ పాస్‌ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేసేలా చట్టం చేశామన్నారు. పరిశ్రమలకు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు వెల్లడించిన మంత్రి.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు. స్థానికులకు అవకాశం కల్పించే పరిశ్రమలకు ఇన్సెంటీవ్‌లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్న మంత్రి.. కేంద్రం దక్షిణాది రాష్ర్టాలను కూడా పట్టించుకోవాలన్నారు. హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులను దక్షిణాది రాష్ర్టాల్లో కూడా ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీకి కేంద్రం సహకారం అందించడం లేదని తెలిపారు. ప్రపంచానికే వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాద్‌కి కేంద్రం చేసిందేమి లేదన్నారు. రాబోయే బడ్జెట్‌లోనైనా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. దేశానికే అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు.

Read Also… బీహార్‌ మాజీ సీఎం లాలూ పరిస్థితి విషమం… రాంచీ రిమ్స్‌ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలింపు.. ఆందోళనలో ఆర్జేడీ కార్యకర్తలు