CM KCR Kodaikanal Tour : ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్ల పర్యటనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 31న సీఎం కేసీఆర్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, సభా స్థలం, డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెలిప్యాడ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కొడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదికను సీఎం ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారన్నారు. స్థానిక మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసే సభలో 5 వేల మంది రైతులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి మాట్లాడనున్నట్లు తెలిపారు.
రూ. 573 కోట్లతో రాష్ట్రంలో 2604 రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి 5 వేల మంది రైతులకు ఒక రైతు వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. రైతు వేదికల ద్వారా రైతు లను సంఘటితం చేయడం, సమావేశాల ద్వారా గిట్టుబాటు ధరలు తెలుసుకోవడం, వ్యవసాయ మెలకువలు నేర్చుకుని, మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్నన్ని చర్యలు దేశంలో మరెవరూ తీసుకోలేదన్నారు.