కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ.. పోలవరం ప్రాజెక్టుపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ.. పోలవరం ప్రాజెక్టుపై చర్చ
Follow us

|

Updated on: Nov 06, 2020 | 6:57 PM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావల్సిన కేంద్రం ఆర్థిక సహాయం విషయంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. జీఎస్టీ సహా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ బకాయిలు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఆమెకి దృష్టికి తీసుకువచ్చారు మంత్రి బుగ్గన. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, సవరించిన అంచనాల ఆమోదంపై సీతారామన్‌తో చర్చించినట్లు సమాచారం. పోలవరంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంచనాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తేనే సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయగలమనే విషయాన్ని కేంద్రమంత్రికి వివరించారు మంత్రి బుగ్గన.

కేంద్రమంత్రితో భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి ప్రభుత్వం 2017లో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. 2013-14 అంచనాలకు పరిమితమై కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం చాలా ఇబ్బందులకు దారి తీసింది. సవరించిన అంచనాల మేరకు భూసేకరణ, పునరావాసం నిమిత్తం దాదాపు రూ.17 వేల కోట్ల మేర అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని కేంద్ర మంత్రికి వివరిచానన్నారు. 2005-06 నుంచి భూమికి సంబంధించిన వివరాలు, పునరావాసం, రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్‌-1, రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్‌-2, రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ ఇచ్చిన నివేదికలను పొందుపర్చి కేంద్ర మంత్రికి నివేదించామన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని కోరామని అని బుగ్గన వివరించారు.

ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే వాటిలో రూ.8వేల కోట్లు మాత్రమే కేంద్రం రీయింబర్స్‌ చేసిందని మంత్రి వివరించారు. ప్రభుత్వానికి రావాల్సిన మరో రూ.4వేల కోట్లలో రూ.2,300 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినందున కేంద్ర ప్రభుత్వానికి బుగ్గన కృతజ్ఞతలు తెలిపారు..