
KCR assures on Metroraill for Oldcity: హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి త్వరలోనే మెట్రో రైలు పరుగులు పెడుతుందని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. నగరం మొత్తానికి మెట్రో రైలు విస్తరించినా.. పాతబస్తీకి రాకపోవడానికి స్థానికంగా వున్న కొన్ని సమస్యలే కారణమని ఆయన చెప్పారు. ఈ అడ్డంకులను తొలగించేందుకు ఎంఐఎం ఎమ్మెల్యేలు కృషి చేస్తే.. త్వరలోనే పాతబస్తీకి మెట్రోరైలు వస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో రైలు కోసం ఎంఐఎం సభ్యులు చేసిన విఙ్ఞప్తులపై స్పందించారు. ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు పూర్తి అయినా.. అక్కడ్నించి ఫలక్‌నుమాకు మెట్రో మార్గం నిర్మాణం కాలేదని, అందుకు మార్గమధ్యంలో వున్న కట్టడాలే కారణమని కేసీఆర్ చెప్పారు.
ఈ కట్టడాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు చొరవ చూపుతారని ఇటీవల ఓవైసీ సోదరులు హామీ ఇచ్చారని కేసీఆర్ చెబుతున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగితే టీఆర్ఎస్ మంత్రులు కూడా వారితో పాటు పాతబస్తీలో పర్యటించి.. వివాదాలను పరిష్కరిస్తారని.. ఆ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మెట్రో మార్గం నిర్మాణం ప్రారంభమవుతుదని ముఖ్యమంత్రి అంటున్నారు. తాను స్వయంగా ఈ విషయంలో చొరవ చూపుతానని, త్వరలోనే పాతబస్తీకి మెట్రో రైలు వచ్చి తీరుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.