ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి వెస్ట్ బెంగాల్ లో హతులైన 50 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు. వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇన్వైట్ చేయాలని మోదీ , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మధ్య సుదీర్ఘంగా.. 5 గంటలపాటు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వీరు ఢిల్లీలో బీజేపీ నేతల ‘ సంరక్షణ ‘ లో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఆహ్వానితుల జాబితా సిధ్ధమైందని, దీన్ని రాష్ట్రపతి భవన్ కు అందజేస్తామని ఈ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమ బెంగాల్ లో గత ఆరేళ్లలో జరిగిన పంచాయతీ, లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలు హతులయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే వీరిని పొట్టన బెట్టుకున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం అమిత్ షా.. హతులైన పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో కొన్నింటిని పరామర్శించారు. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..కాగా-మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు ఏడువేల మంది హాజరవుతున్నారు..
కాగా-ఈ కుటుంబాలను ఆహ్వానించాలని మోదీ తీసుకున్న నిర్ణయం బెంగాల్ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ .ని రాజకీయంగా ఎదుర్కోవడానికేనని భావిస్తున్నారు. బెంగాల్ లో మరో రెండేళ్ళలో.. 2021 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందే దీదీని దెబ్బ తీయాలంటే ఇలాంటి ‘ నిర్ణయాలు ‘ చాలా ముఖ్యమని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో కూడా పలువురు బీజేపీ కార్యకర్తలు టీఎంసి శ్రేణులతో జరిగిన ఘర్షణల్లో మరణించారు. ఈ ఎన్నికల్లో కమలనాథులు గతంతో (2014) తో పోలిస్తే రెండు సీట్ల నుంచి 18 సీట్లను గెలుచుకోవడం, అధికార టీఎంసీ సీట్లు 34 నుంచి 22 కు పడిపోవడం పొలిటికల్ గా బీజేపీకి బాగా కలిసివచ్ఛే అంశం. అటు-టీఎంసి నుంచి సుమారు 60 మంది బీజేపీ శిబిరంలో జంప్ చేయడానికి రెడీ అయ్యారు. వీరిలో చాలామంది అప్పుడే ఆ పార్టీ తీర్థం పుచ్ఛుకున్నారు కూడా. .. దీంతో పశ్చిమ బెంగాల్ లో మమత పట్టు మరింత దిగజారుతుందని కమలనాథులు సంబరపడుతున్నారు.