పుణేలో మహిళ ఆత్మహత్య కేసు, మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా.

మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా చేశారు. పుణేలో జరిగిన  23 ఏళ్ళ యువతి ఆత్మహత్య కేసుతో ఈయనకు ప్రమేయముందని,..

  • Umakanth Rao
  • Publish Date - 6:20 pm, Sun, 28 February 21
పుణేలో మహిళ ఆత్మహత్య కేసు, మహారాష్ట్ర అటవీ శాఖ  మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా.

మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా చేశారు. పుణేలో జరిగిన  23 ఏళ్ళ యువతి ఆత్మహత్య కేసుతో ఈయనకు ప్రమేయముందని, ఈయన రాజీనామా చేయాలనీ బీజేపీ ఆరోపించింది. దీంతో సంజయ్ రాథోడ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్ థాక్రేకి సమర్పించానని, ఆ మహిళ డెత్ కేసుకు, తనకు లింక్ ఉందని ఆరోపిస్తున్నారని పేర్కొన్న ఆయన.. ఇక పదవిలో కొనసాగడం మంచిది కాదని పదవి నుంచి వైదొలగానని అన్నారు. ఈ కేసు దర్యాప్తు చురుగ్గా జరగాలని, సత్యమేమిటో బయటకు రావాలని అన్నారు. మహారాష్ట్రలోని బీద్ జిల్లాకు చెందిన పూజా చవాన్ అనే యువతి తన సోదరునితోను, అతని స్నేహితులతోను కలిసి పుణేలో ఇంగ్లీష్ కోర్సు చదువుతూ ఈనెల 8 న సూసైడ్ చేసుకుంది. ఆమె మరణించిన రెండు రోజుల తరువాత సోషల్ మీడియాలో ఆమె సూసైడ్ కు సంబంధించి ఓ ఆడియో క్లిప్ బయటపడింది. అందులో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారని, వారిలో ఒకరు సంజయ్ రాథోడ్ అని స్ఫష్టమైందని బీజేపీ నాడే ఆరోపించింది. కానీ యధాప్రకారం ఈ ఆరోపణను రాథోడ్ ఖండించారు. ఆ యువతీ ఆత్మహత్యకు, తనకు ఎలా లింక్ పెడతారని ఆయన ప్రశ్నించారు.

పూజా చవాన్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ మంత్రి రాజీనామా చేయాలనీ, బీద్ జిల్లాలో ఇతని దిష్టిబొమ్మను దహనం చేశారని మహారాష్ట్ర  బీజేపీ ఈ మధ్యే ట్వీట్ చేసింది.  యువతి మృతి ఘటనపై మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందిస్తూ.. శివసేన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.  తీవ్ర ఆరోపణలకు గురైన సంజయ్ రాథోడ్ పై చర్యకు ఈ  ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆయన ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, రాథోడ్ రాజీనామా చేయాలని ఆయన అన్నారు. 49 ఏళ్ళ రాథోడ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విదర్భ రీజన్ లో ఈయన పాపులర్ లీడర్.. బంజారా వర్గ నేతలు ఈ ఉదయం ఈయనకు మద్దతు పలుకుతూ.. రాజీనామా చేయవద్దని కోరారు. ముఖ్యమంత్రి ఈయన రాజీనామాను ఆమోదించరాదని కూడా వారు విజ్ఞప్తి చేశారు.