ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఇండియాలో కూడా ఈ వైరస్ రోజురోజుకూ తన పరిధిని పెంచుకుంటూ వెళ్తోంది. దీంతో ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. దీంతో వీటి వాడకం భారీగా పెరిగింది. ఇక్కడే కొందరు వ్యాపారులు దుర్బుద్ది చూపిస్తున్నారు. ప్రజల్లోని భయాన్ని గమనించి భారీ దోపిడీలకు స్కెచ్ గీశారు.
మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో కొందరు మెడికల్ షాపుల యజమానులు, వ్యాపారులు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని, ఎక్స్‌పైరి డేట్ ముగిసిన శానిటైజర్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఎఫ్‌డీఏ ఆఫీసర్స్ దాడులు నిర్వహించి రూ. 50 లక్షల విలువచేసే శానిటైజర్లు సీచ్ చేశారు. ఔరంగబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలోని వాలుజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో గడపు ముగిసిన లేబల్స్ తీసి, లేటెస్ట్‌గా 2021 వరకు ఎక్స్‌పైరి డేట్ ఉన్నట్టు కొత్త లేబుళ్లను అతికిస్తున్నట్టు ఎఫ్‌డీఏ జాయింట్ కమిషనర్ సంజయ్ కాలే పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు పాల్పడినవారిపై కేసులు నమోదు చేసి తీవ్ర చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.