తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ దగ్ధమై డ్రైవర్ సజీవదహనం కాగా, క్లీనర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. ఏజెన్సీలో చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ లారీ పల్టీ కొట్టింది. దుర్గమ్మ గుడి సమీపంలో రక్షణ గోడ పైనుండి లోయలోకి పడిపోయింది. అంతే.. ఒక్కసారి మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. బయటపడేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. లారీ పల్టీ కొట్టడం.. వెంటనే మంటలు అంటుకోవడం.. చూస్తుండగానే చుట్టుముట్టేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. లారీడ్రైవర్‌కు బయటపడే అవకాశం ఏమాత్రం లేకుండాపోయింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ క్లీనర్ ను చింతూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికే లారీ డ్రైవర్ సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.