ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ సైకిల్స్ అధినేత సంజయ్ కపూర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య నటాషా కపూర్(57) ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో నటాషా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయారు. మంగళవారం ఈ ఘటన జరగ్గా.. ఆమె బలవన్మరణానికి పాల్పడిన సమయంలో ఇంట్లో ఆమె కొడుకు, కూతురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పోలీసులకు ఘటనాస్థలంలో ఓ సూసైడ్ నోట్ దొరికినట్లు సమాచారం.
మరోవైపు ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. ఆర్ధిక సంక్షోభమే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. ఇకపోతే అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. ఇక ఆమె మృతదేహానికి గంగారాం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలకు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.