Onion Farmer: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్థవ్యస్థవడమే కాదు.. పంటలు నష్టపోవడంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధర సెంచరీదాటి.. డబుల్ సెంచరీగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.. అయితే కర్నూలు జిల్లాలోని టమాటా రైతులు మాత్రం టమాటా ధర పెరుగుదలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే వర్షాలకు తాము నష్టపోయామంటూ కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతులు కన్నీరు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లా గూడూరు లో గత 10 రోజులుగా కురిసిన వర్షానికి రైతాంగం కుప్పకూలింది. ముఖ్యంగా వర్షాల కారణంగా ఉల్లిపాయలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. ఉల్లికి మొలకలు వచ్చాయి. దీంతో ఉల్లి అమ్ముడు పోక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఉల్లి పంటను సాగు చేసిన రామాంజనేయులు అనే రైతు.. ఉల్లిపాయలను పశువులు తినడానికి వదిలేశాడు. రైతు రామాంజనేయులు 10 ఎకరాలలో ఉల్లి పంట సాగుచేశాడు. అందుకోసం రూ. 6 లక్షలు పెట్టుబడి కూడా పెట్టినట్లు రైతు చెప్పాడు. అయితే తాను పెట్టిన పెట్టుబడిలో కనీసం రూ. 50వేల కూడా రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి గుడిపాడుకు చెందిన రైతు కృష్ణ కు కూడా ఏర్పడింది. కృష్ణ 12 ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి సాగు చేశాడు. ఎకరానికి రూ. 70వేలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఇప్పుడు కురిసిన వర్షాలతో ఉల్లి తడిచి మొలకలు వచ్చాయి.. దీంతో ఏ వ్యాపారస్తులు కొనడంలేదని తెచ్చిన అప్పులకు వడ్డీలుకుడా తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: చలికాలంలో గుడ్డుని రోజూ తినే ఆహారంలో చేర్చుకోమంటున్న నిపుణులు.. డిఫరెంట్ ఈజీ రెసిపీలు మీకోసం..