శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనకు శ్రీశైలం ఎప్పడు రావోలో తెలుసని అన్నారు. శ్రీశైలం రావడానికి తనకు 3 గంటలే పడుతుందని తెలిపారు. శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు కేటాయించిన షాపుల లిస్ట్‌ను రాజాసింగ్ బయటపెట్టారు. టెంపుల్ ప్రాంగణం, ఈఓ కార్యాలయంలో అన్యమతస్తులు తిరుగుతున్న ఫోటోలను సైతం ఆయన చూపించారు. ఎవరి అండ చూసుకొని శ్రీశైలం ఆలయంలో రజాక్ రెచ్చిపోతున్నాడో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.
నాలుక కోస్తామని చక్రపాణిరెడ్డి అంటున్నారని, అలా మాట్లాడడం తన సంస్కారం కాదని స్పష్టం చేశారు. తాము తల్చుకుంటే దేశం మొత్తం శ్రీశైలంకు కదులుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి కళ్లు తెరవాలి హితవు పలికారు. రజాక్ భార్య గోశాల ఇన్‌చార్జిగా ఉన్న సమయంలోనే 300 ఆవులు మరణించాయని ఆరోపించారు. దేవస్థానం డబ్బులు ఇస్తున్నా ఆవులు ఎందుకు చనిపోతున్నాయో ఎమ్మెల్యేకు తెలియదా అని ప్రశ్నించారు.