జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో ఇబ్బందిపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఎందుకంటే గత ఐదేళ్లలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే సరిపోతుంది. అయితే అధిష్ఠానం దీనికి పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. అందుకోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ సీనియర్ శ్రేణులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవానికి బాధ్యతగా పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడిగా ఎవరు నియమితులవుతారో అని తెలంగాణలో చర్చ మొదలైంది.
ఇదిలా ఉంటే పీసీసీ ఛీప్ రేసులో ఇప్పుడు మాజీ మంత్రి, మహిళా నాయకురాలు కొండా సురేఖ పేరు వినిపిస్తోంది. అయితే పార్టీ అధిష్ఠానం మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు పార్టీలో ఉన్న సీనియర్ నేతలు డీ.కె.అరుణ, విజయశాంతిలు బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకే పార్టీలో వారికి ధీటుగా మహిళలకు పెద్ద పీట వేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అంతేకాకుండా కొండా సురేఖకు రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన బీసీ సామాజిక వర్గాల్లో మంచి సంబంధాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, మంచి వాక్చాతుర్యం లాంటివి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకురాలు సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు కీలక కమిటీల్లో ఆమె పేరు చేరుస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.