వాళ్ళను బదులు నన్ను కాల్చి చంపండి, మయన్మార్ లో పోలీసుల ముందు ఓ నన్ వేడుకోలు

| Edited By: Anil kumar poka

Mar 09, 2021 | 6:33 PM

మయన్మార్ లో సైనిక ప్రభుత్వం గద్దె దిగలంటూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యం, పోలీసులు విచక్షణా రహితంగా...

వాళ్ళను బదులు నన్ను కాల్చి చంపండి, మయన్మార్ లో  పోలీసుల ముందు ఓ నన్ వేడుకోలు
Follow us on

మయన్మార్ లో సైనిక ప్రభుత్వం గద్దె దిగలంటూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యం, పోలీసులు విచక్షణా రహితంగా బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. రబ్బర్ బులెట్లు, అసలైన తూటాలతో కాల్పులు జరుపుతున్నారు. తాజాగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. యాంగాన్ సిటీలో జరిగిన ఘటనల్లో ఓ నన్ తనముందే ఓ నిరసనకారుడిని పోలీసులు తలపై కాల్చి చంపడం చూసి చలించిపోయింది. రక్తమోడుతూ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంపై ఆమె దుఃఖాన్ని పట్టలేకపోయింది. ఈ నిరసనకారుల్లో పిల్లలు, ఇంకా 15 ఏళ్ళు కూడా దాటని వారు ఉన్నారని, దయ చేసి వారిపై కాల్పులు జరపవద్దంటూ తనను చుట్టుముట్టిన పోలీసులను ఆమె వేడుకుంది. మోకాళ్లపై కూర్చుని దీనంగా ప్రార్థించింది. ‘దయచేసి వారిని వదిలేయండి.. వారిని టార్చర్ పెట్టకండి.. కావాలంటే వారిని వదిలి నాపై కాల్పులు జరిపి నా ప్రాణం తీయండి’ అంటూ ఆ 45 ఏళ్ళ నన్ వారిని ప్రార్థించింది. సిస్టర్ యాన్ రోజ్ అనే ఈమెతో బాటు మరో ఇద్దరు నన్స్ కూడా ఇలాగే వేడుకున్నారు. పిల్లలంతా భయంతో పారిపోతున్నారని, వారిని కాపాడడానికి నేనేమీ చేయలేకపోతున్నానని, ఆ భగవంతుడే రక్షించాలని సిస్టర్ రోజ్ వాపోయింది. కాగా-  తమప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరు చూపిన ధైర్య సాహసాలను చూసి అంతా ఆశ్చర్యపోయారు. గత నెల 28 న కూడా ఈ సిస్టర్ మెల్లగా నడుస్తూ పోలీసుల వద్దకు చేరుకొని ఇలాగే దీనంగా ప్రార్థించిందట.

సైనిక ప్రభుత్వానికి  వ్యతిరేకంగా  జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 60 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. తమ నేత ఆంగ్ సాన్ సూకీని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 1 న మయన్మార్ లో సైనిక  ప్రభుత్వం కుట్ర జరిపి ఆంగ్ సాన్  సూకీని నిర్బంధంలోకి తీసుకుంది. ఏడాది పాటు  ఎమర్జెన్సీ విధించింది. ఈ దేశంపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఐరాస కూడా మయన్మార్ లో మిలిటరీ ప్రభుత్వ దమన నీతిని ఖండించింది.



మరిన్ని చదవండి ఇక్కడ :

Jharkhand: అసెంబ్లీకి గుర్రంపై వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!

China: మగవారు లేని మహిళ రాజ్యం గురించి మీకు తెలుసా…!