పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం ప్రచారం చేయడం విదితమే. ఈ క్రమంలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వంపై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పార్లమెంటు ఆమోదించిన ఓ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ప్రభుత్వ నిధులను ఎలా ఖర్చు చేస్తారంటూ ప్రశ్నించారు.
పార్లమెంటు ఆమోదం పొందిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం దిన పత్రికల్లో ప్రకటనలు ఇస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆయన మాట్లాడుతూ… ‘‘సీఏఏ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం ఏమాత్రం సరికాదు. ఇలాంటి ప్రచారం రాజ్యాంగ విరుద్ధమైనందున వెంటనే దీన్ని మానుకోవాలి…’’ అని పేర్కొన్నారు.