ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. మార్కెట్లలో మరోసారి లాక్‌డౌన్‌..! శుభకార్యాలకు అతిథుల సంఖ్య కుదింపు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండో దశ వికృతరూపం దాల్చుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ విపరీతంగా నమోదవుతున్నాయి.

ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. మార్కెట్లలో మరోసారి లాక్‌డౌన్‌..! శుభకార్యాలకు అతిథుల సంఖ్య కుదింపు

Updated on: Nov 17, 2020 | 3:13 PM

#Kejriwalonlockdown: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండో దశ వికృతరూపం దాల్చుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌ సిద్ధమైంది. కరోనా వైరస్ హాట్‌స్పాట్లుగా మారుతున్న మార్కెట్లను మూసివేయాలని, పెళ్లిళ్లు ఇతరత్రా జన సమర్థక వేడుకల్లో సభ్యుల పరిమితిని కుదించాలని భావిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు.

ఢిల్లీలో కరోనా పరిస్థితులపై సీఎం కేజ్రీవాల్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశ రాజధానిలో కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం శయశక్తులా కృషి చేస్తున్నాయన్నారు. అయితే, పండుగల వేళ మార్కెట్‌ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండంతో, అవి కరోనా హాట్‌స్పాట్లుగా మారుతున్నాయని అన్నారు. కరోనా కట్టడిలో భాగంగా మార్కెట్లలో మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం కల్పించాలంటూ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు ప్రతిపాదనలు పంపినట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. మరోవైపు పెళ్లిళ్లు, శుభాకార్యాలకు హాజరయ్యేందుకు అతిథుల పరిమితిని 50కి కుదించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు, కరోనా వైరస్ పట్ల జనం నిర్లక్ష్యం వహించరాదన్న కేజ్రీవాల్.. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.