kcr new year gift for govt employees: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. కొత్తేడాది కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరిగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వేతనాలు పెరిగేది వీరికే..
ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించారు. వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాలు..
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు.
సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్..
‘ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్ రూపొందించాలి’ అని కేసీఆర్ తెలిపారు. పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దని, ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
Also read: LRS Scheme: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకూ రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఆదేశం..