ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ మంగళవారం కన్నుమూశారు. చెన్నైలోని ఎగ్మోర్‌లోని తన స్వగృహంలో గుండెపోటుకు లోనయ్యారు. వెంటనే ఆయన్ను సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. డిసెంబర్ 27, 1937న జన్మించిన ఆయన.. మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కూడా ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించారు. 1989లో ఆయనను యాజమాన్య రత్న పురస్కారంతో అప్పటి ప్రభుత్వం గౌరవించింది. ఇక 1991లో నాగార్జున యూనివర్సిటీ ఆయనకు.. డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీని ప్రదానం చేసింది. కాగా.. గతంలో ఫిక్కీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోతో పాటుగా.. చెన్నైలో కూడా కేసీపీ పరిశ్రమలను స్థాపించారు. గురువారం రోజు ఆయన అత్యంక్రియలు జరగనున్నాయి. దత్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మృతి భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటన్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా.. పలువురు రాజకీయ నేతుల సంతాపం తెలియజేశారు.