గృహిణిలకు వేతనాలు.. వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా రైతులు.. కమల్‌హాసన్ కానుకలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీల నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలను ప్రకటిస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీల నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలను ప్రకటిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి పొంగల్ గిఫ్ట్ అందిస్తున్నట్లు వెల్లడించగా, తాజాగా మక్కల్ నీధి మయ్యమ్ అధినేత, నటుడు కమల్ హాసన్ అప్పుడే ఎన్నికల హామీల వర్షం గుప్పించడం ప్రారంభించారు. తాము ఆర్థిక విప్లవంపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపిన ఆయన.. తొలి విడతగా ఎన్నికల హామీల్లో ఆ మాట నిలుపుకుంటామన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని గృహిణిలకు వేతనాలు ఇవ్వనున్నట్లు కమల్ ప్రకటించారు. దీంతో ఎన్నికల హామీల్లో గృహిణుల ప్రస్తావన చేసిన మొదటి వ్యక్తి కమల్ హాసన్ నిలవబోతున్నారు. అంతే కాకుండా వారికి ఉచితంగా కంప్యూటర్లు అందజేస్తూ హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీధి మయ్యమ్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే హామీలన్ని నేరవేరుస్తామని కమల్ హాసన్ అన్నారు.