Joe Biden First Decision: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించనున్న విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న జో బైడెన్.. ఈనెల 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే ట్రంప్ హయాంలో అగ్రరాజ్యం తన వైభవాన్ని కోల్పోయిందంటూ చర్చసాగుతోన్న వేళ.. కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బైడెన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడన్నదానిపై సర్వత్రా ఆసక్తినెలకొని ఉంది. ఈ నేపథ్యంలో బైడెన్ తీసుకోబోయే నిర్ణయాలపై ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాన్ క్లెయిన్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే పారిస్ ఒప్పందంలో అమెరికా చేరికకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై బైడెన్ సంతకం చేస్తారని రాన్ క్లెయిన్ పేర్కొన్నారు. దీంతోపాటు ముస్లిం దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధంపై బైడెన్ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేయడంతోపాటు జాతి వివక్షపై ఉక్కుపాదం మోపే నిర్ణయాలను బైడెన్ ప్రకటించే అవకాశం ఉందని రాన్ క్లెయిన్ వివరించారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే దాదాపు 12 కీలక ఆర్డర్‌లపై బైడెన్ సంతకం చేస్తారని కాబోయే చీఫ్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు.