కరోనా నేపథ్యంలో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలను వాయిదావేయాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ డిమాండ్ చేశారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పరీక్షలు నిర్వహించడం పట్ల మరోసారి పునరాలోచన చేయాలన్నారు. పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థుల్లో ఎవరికి కరోనా ఉన్నదనే విషయం తెలుసుకోవడం కష్టసాధ్యమన్నారు. అందువల్ల నీట్ , జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు లేఖ రాశారు హేమంత్ సోరేన్. కరోనాతో పరీక్ష రాయడానికి వచ్చిన వారివల్ల ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉన్నదని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం అడినట్లేనని గుర్తు చేశారు సీఎం హేమంత్ సోరేన్. ప్రస్తుత పరిస్తిత్తుల్లో రాష్ట్రంలో బస్సు సర్వీసులు ప్రారంభించడం, హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచే అవకాశం లేదని వెల్లడించారు. కంటైన్‌మెంట్ జోన్లలోని విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇబ్బంది కలిగుతుందని, వారు పరీక్షా రాయడానికి వస్తే ఇతర విద్యార్థులకు ప్రమాదం ఉంటుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కోరారు.
అయితే, కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ పరీక్షలను ఈసారి నిర్వహించాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీంతో జేఈఈ, నీట్ నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 85 శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ జరుగనున్నాయి.