CM Jagan has taken one more step towards his target: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాను నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా మరో అడుగు వేశారు. మరో 22 రోజుల్లో జరగనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి లక్ష్య సాధన దిశగా ఎలాంటి పురోగతి వుందో కలెక్టర్లతో వాకబు చేశారు.
స్పందన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సమీక్షించారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లపట్టాలపై అధికారులు, కలెక్టర్లతో సమాలోచనలు జరిపారు సీఎం. జిల్లాల వారీగా ఇవ్వనున్న ఇళ్లపట్టాలు, స్థలాల గుర్తింపు, అభివృద్దిపై సమీక్షలో భాగంగా విస్తృతంగా చర్చించారు. ఇళ్లస్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్ల డెవలప్‌మెంట్ వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిని అనుకున్న గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించిన సీఎం, ఈవిషయంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని అధికారులకు చెప్పారు. ఉగాది సమీపిస్తున్న నేపథ్యంలో ప్లాట్లను అభివృద్ధి చేసి పంపిణీకి సిద్ధంచేయాలన్న సీఎం.. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించి ఇళ్లపట్టాల విషయంలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
అనుమతులు, ఆర్థిక వనరుల కేటాయింపు విషయంలో జిల్లా కలెక్టర్లు సహా యంత్రాంగానికి అండగా ఉండాలని, 25 లక్షల ఇళ్లపట్టాలు ఉగాది రోజున పంపిణీ చేయాలని చెప్పారు. అయితే.. ఒకవైపు స్థానిక ఎన్నికలకు గడువు నెల రోజులే వుండడంతో ఇళ్ళ పట్టాల పంపిణీపై ఎలాంటి ప్రభావం వుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారుతుందా అనే అంశంపై కూడా రాజకీయపరమైన చర్చలు మొదలయ్యాయి.
రెండు గంటల్లో పెన్షన్ల పంపిణీ
మార్చి 1వ తేదీన జరిగిన గడపగడపకూ పెన్షన్ల పంపిణీని కూడా సీఎం సమీక్షించారు. పెన్షన్ల పంపిణీ బాగా జరిగిందని కలెక్టర్లను ప్రశంసించిన సీఎం.. వచ్చే నెలలో గడపగడపకూ పెన్షన్ల పంపిణీ మరింత వేగంగా జరగాలని చెప్పారు. ప్రతి యాభై కుటుంబాలకు మ్యాపింగ్ కరెక్టుగా జరగాలని, వచ్చే నెల ఒకటిన కేవలం 2 గంటల్లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు.