AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. పాత వెస్టిండీస్ పుట్టుకొచ్చిందా? వీళ్లను తట్టుకొని 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామా?

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను వణికించిన వెస్టిండీస్ పేస్ ఎటాక్ మళ్లీ పునరాగమనం చేస్తున్నదా? జేడెన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్, షామర్ జోసెఫ్ అద్భుత బౌలింగ్‌తో పాకిస్థాన్‌ను చిత్తు చేశారు. 1975, 1979 ప్రపంచకప్‌లలో ప్రత్యర్థులను భయపెట్టిన కరేబియన్ పేస్ సంస్కృతి మరోసారి కనిపిస్తోందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వామ్మో.. పాత వెస్టిండీస్ పుట్టుకొచ్చిందా? వీళ్లను తట్టుకొని 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామా?
West Indies Bowling Attack
SN Pasha
|

Updated on: Jul 29, 2026 | 10:30 AM

Share

ఇప్పటి క్రికెట్ అభిమానులకు వెస్టిండీస్ క్రికెట్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు వెస్టిండీస్ టీమ్ అంటే.. ఓ సాధారణ జట్టు. కానీ ఓల్డ్ జనరేషన్‌ని వెస్టిండీస్ క్రికెట్ అంటే ఏంటి అని అడిగితే.. అదో పెద్ద కథ సామి అంటూ మొదలుపెడతారు. ప్రపంచ క్రికెట్‌పై ఆస్ట్రేలియా డామినేషన్ కంటే ముందు వెస్టిండీస్ రాజ్యం చేసింది. ప్రపంచ క్రికెట్‌ను ఒంటి చేత్తో శాసించిన టీమ్ అంది. వాళ్లతో మ్యాచ్ అంటేనే చాలా దేశాల క్రికెటర్లు భయపడేవాళ్లు. మ్యాచ్ గెలవడం అటుంచి.. గాయాలు కాకుండా బయటపడితే చాలా అనుకునేవాళ్లు. ఎందుకంటే.. వెస్టిండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ అలా ఉండేది. మిషన్ గన్ నుంచి దూసుకొచ్చే బుల్లెట్లను పాత చెక్క ముక్కతో అడ్డుకుంటే ఎలా ఉంటుందో.. అప్పట్లో వాళ్ల బౌలింగ్ ఆడాలంటే అలా ఉండేది. అరివీర భయంకరమైన బౌలర్లు. వాళ్ల పేస్, బౌన్సర్లు.. వామ్మో తల్చుకుంటే ఇప్పటికీ కొంతమంది పాతతరం క్రికెటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి.

వన్డే వరల్డ్ కప్ మొదలుపెట్టిన తర్వాత వరుసగా రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లు కరేబియన్లే. 1975, 1979 వన్డే వరల్డ్‌కప్‌లలో వెస్టిండీస్ విజయాలకు వారి భయంకరమైన ఫాస్ట్ బౌలింగ్ దళమే ప్రధాన బలం. ఆండీ రాబర్ట్స్ తన వేగం, బౌన్సర్లతో ప్రత్యర్థులను వణికించగా, మైకేల్ హోల్డింగ్ తన మృదువైన రన్-అప్, మెరుపువేగంతో విస్పరింగ్ డెత్‌గా గుర్తింపు పొందాడు. జోయెల్ గార్నర్ 6 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో యార్కర్లతో బ్యాటర్లను కట్టడి చేశాడు. కాలిన్ క్రాఫ్ట్, వేన్ డేనియల్ వంటి పేసర్లు కూడా బలమైన మద్దతు అందించారు. ఈ ఘోరమైన పేస్ దాడికి వివియన్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ వంటి బ్యాటర్ల అండతో వెస్టిండీస్ వరుసగా 1975, 1979 ప్రపంచకప్‌లను కైవసం చేసుకుంది. ఆ తర్వాత మాల్కమ్ మార్షల్, కర్ట్లీ అంబ్రోస్, కర్ట్నీ వాల్ష్ లాంటి అద్బుతమైన బౌలర్లు కూడా వెస్టిండీస్ నుంచి వచ్చారు.

అదే బలం.. మళ్లీ పుట్టుకోస్తోంది..?

అప్పుడున్నంత భయంకరంగా ఇప్పుడు వెస్టిండీస్ టీమ్ లేదు. వారి పతనానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం వెస్టిండీస్ టీమ్‌లో మళ్లీ పేస్ బౌలింగ్ కళ కనిపిస్తోంది. తాజాగా బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్‌పై 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ సీమర్ గ్రీవ్స్ అద్భుత బౌలింగ్‌తో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కేవలం 27 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టిన గ్రీవ్స్ పాకిస్థాన్‌ను 282 పరుగులకే కట్టడి చేశాడు. ఆ తర్వాత పాక్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ పేసర్ జేడెన్ సీల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 20 పరుగులకే ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. ఈ విజయంతో వెస్టిండీస్ ఒక్కసారిగా క్రికెట్ లోకాన్ని తనవైపు చూసేలా చేసింది. ముఖ్యంగా వాళ్ల పేస్ బౌలర్లు.

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను తన వేగవంతమైన బౌలర్లతో శాసించిన వెస్టిండీస్ జట్టు గత కొన్నేళ్లుగా ఆ స్థాయి ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు జేడెన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్, కెమార్ రోచ్, షామర్ జోసెఫ్ రూపంలో మరోసారి కరేబియన్ జట్టుకు బలమైన ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ దొరికినట్లు అనిపిస్తోందంటూ క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇలాంటి అద్భుతమైన పేస్ ఎటాక్‌ను ఎదుర్కొని సౌతాఫ్రికా పిచ్‌లపై మ్యాచ్‌లు గెలవడం సాధ్యమేనా అనే భయం మాత్రం ప్రతి టీమ్‌లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియా కూడా వీరి బౌలింగ్‌ను డీప్‌గా అబ్జర్వ్ చేస్తున్నట్లు సమాచారం.

జేడెన్ సీల్స్.. చిన్న వయసులోనే పెద్ద రికార్డులు

ట్రినిడాడ్‌కు చెందిన జేడెన్ సీల్స్ 2001 సెప్టెంబర్ 10న జన్మించాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అతను 2021లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అరంగేట్రం సిరీస్‌లోనే తన వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. సీల్స్ కొత్త బంతితో స్వింగ్ చేయించడంలో దిట్ట. అవసరమైనప్పుడు బౌన్స్‌ను కూడా సమర్థంగా ఉపయోగించగలడు. టెస్టు క్రికెట్‌లో తొలి 15 మ్యాచ్‌ల్లోనే 50కి పైగా వికెట్లు సాధించిన యువ వెస్టిండీస్ పేసర్లలో ఒకరిగా నిలిచాడు. ఇటీవల పాకిస్థాన్‌పై జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 20 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. అతని స్పెల్ మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది.

ఇప్పటివరకు సీల్స్ టెస్టు క్రికెట్‌లో 25కు పైగా మ్యాచ్‌లు ఆడి 80కి పైగా వికెట్లు సాధించాడు. అతని సగటు 23–25 మధ్య ఉండటం అతని నిలకడను చూపిస్తోంది. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం అతని కెరీర్‌లో పలుమార్లు నమోదైంది. టెస్టు ఫార్మాట్‌లోనే కాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా వెస్టిండీస్ భవిష్యత్ ప్రధాన బౌలర్‌గా అతడిని భావిస్తున్నారు.

జస్టిన్ గ్రీవ్స్.. ఆల్‌రౌండర్‌గా మొదలై మ్యాచ్ విన్నర్‌గా..

జస్టిన్ గ్రీవ్స్ 1994 ఫిబ్రవరి 26న బార్బడోస్‌లో జన్మించాడు. కుడిచేతి బ్యాటర్, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన గ్రీవ్స్ తొలుత ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్‌లో బార్బడోస్ తరఫున నిలకడగా రాణించడంతో వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. బ్యాటింగ్‌తో పాటు అవసరమైన సమయంలో కీలక వికెట్లు తీయడం గ్రీవ్స్ ప్రత్యేకత. పాకిస్థాన్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 244/3తో బలంగా ఉన్న పాకిస్థాన్‌ను కేవలం 282 పరుగులకే పరిమితం చేయడంలో అతనే కీలక పాత్ర పోషించాడు. 27 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా వెస్టిండీస్ వైపు తిప్పాడు. ఇది అతని టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో ఒకటిగా నిలిచింది. గ్రీవ్స్ కేవలం బౌలింగ్‌తోనే కాదు, అవసరమైనప్పుడు దిగువ వరుసలో విలువైన పరుగులు చేయగల సామర్థ్యంతో కూడా జట్టుకు ఉపయోగపడుతున్నాడు. అందుకే అతడిని పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా వెస్టిండీస్ జట్టు భావిస్తోంది.

వెస్టిండీస్‌కు కొత్త ఆశలు

గతంలో మాల్కమ్ మార్షల్, కర్ట్లీ అంబ్రోస్, కర్ట్నీ వాల్ష్ వంటి దిగ్గజ పేసర్లు ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. ఆ తర్వాత అలాంటి స్థాయి బౌలర్ల కొరత వెస్టిండీస్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు జేడెన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ వంటి యువ బౌలర్లు జట్టుకు కొత్త ఆశలను నింపుతున్నారు. ఇద్దరూ కలిసి కొత్త బంతితో ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను కట్టడి చేయడంలో సమర్థులని ఇప్పటికే నిరూపించారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో ఓర్పుతో బౌలింగ్ చేయడం, సరైన లైన్ అండ్ లెంగ్త్‌ను కొనసాగించడం, కీలక సమయంలో వికెట్లు తీయడం వీరి బలాలు. ఇదే జోరు కొనసాగితే వెస్టిండీస్ మళ్లీ ప్రపంచ టెస్టు క్రికెట్‌లో బలమైన జట్టుగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us