లోకల్ ట్రిప్స్ పై ఐఆర్సీటీసీ ఫోకస్..!

ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ పర్యటనలనునిర్వహించే ఐఆర్సీటీసీ కోవిడ్ దెబ్బకు కుదేలైంది. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు పూర్తీగా రద్దయ్యాయి. ప్రస్తుతం నిబంధనలను సడలించడంతో స్థానిక పర్యటనలపై ఫోకస్ చేశారు అధికారులు.

  • Balaraju Goud
  • Publish Date - 3:19 pm, Wed, 3 June 20
లోకల్ ట్రిప్స్ పై ఐఆర్సీటీసీ ఫోకస్..!

ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ పర్యటనలనునిర్వహించే ఐఆర్సీటీసీ కోవిడ్ దెబ్బకు కుదేలైంది. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు పూర్తీగా రద్దయ్యాయి. ప్రస్తుతం నిబంధనలను సడలించడంతో స్థానిక పర్యటనలపై ఫోకస్ చేశారు అధికారులు.
లాక్ డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పడే కోలుకుంటున్న ఐఆర్సీటీసీ పర్యాటకులను ఆకర్షించే పనిలో పడింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా స్థానిక పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తోంది. త్వరలో ఈ ప్యాకేజీలకు సంబంధించి వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ సైట్ సీయింగ్ తోపాటు, భద్రాచలం, శ్రీశైలం, విశాఖ, తిరుపతి వంటి పర్యటనలకే ప్యాకేజీలు పరిమితం కానున్నాయి.
సాధారణంగా ఐఆర్సీటీసీ దేశీయ పర్యటనలకు మాత్రమే రైళ్లను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో పర్యటన వారం నుంచి 15 రోజుల వరకు కొనసాగుతుంది. అయితే కోవిడ్ దృష్ట్యా రోడ్డు మార్గం ద్వారానే పర్యటనలు ఏర్పాటు చేయనున్నారు. 30 మంది ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సుల్లో 20 మంది టూరిస్టుల చొప్పున తీసుకెళ్లనున్నట్లు ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టిన వెంటనే పర్యాటక ప్యాకేజీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా పర్యటనలను రూపొందించి నిర్వహించేందుకు అధికారులు వ్యూహరచన చేస్తున్నారు.
వేసవి సెలవుల్లో నగరవాసులు పెద్ద ఎత్తున జాతీయ అంతర్జాతీయ పర్యటనలకు వెళ్తారు. ఊటీ, సిమ్లా, కులుమనాలి, గోవా, జమ్ము కశ్మీర్, న్యూఢిల్లీ, ఆగ్రా, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిర్వహించే సుమారు 50కి పైగా ప్యాకేజీలు రద్దు కావడంతో 10 వేల మందికి పైగా తమ పర్యటనలను ఉపసంహరించుకున్నారు. జాతీయ పర్యటనలతోపాటు చైనా, శ్రీలంక, సింగపూర్, థాయ్లాండ్, మలేషియా, నేపాల్ తదితర దేశాలకు సైతం వేసవిలో నిర్వహించే పర్యటనలను ఐఆర్సీటీసీ ఈ ఏడాది రద్దు చేసింది. సుమారు రూ. 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆర్థికంగా చతికిలబడ్డ ఐఆర్సీటీసీని బలోపేతం చేయడానికి లోకల్ ట్రిప్స్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది.