AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakiladri: ‘ఇంద్రకీలాద్రి’పై కనకదుర్గమ్మ ఎలా వెలిసింది? ఆ పేరు వెనుక ఉన్న పురాణ రహస్యం ఇదే!

Indrakeeladri Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఎలా వెలిసింది? ఆ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? అమ్మవారు కనకదుర్గగా ప్రసిద్ధి చెందడం వెనుక ఉన్న పౌరాణిక కథలు, ఆలయ విశేషాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Indrakiladri: ‘ఇంద్రకీలాద్రి’పై కనకదుర్గమ్మ ఎలా వెలిసింది? ఆ పేరు వెనుక ఉన్న పురాణ రహస్యం ఇదే!
Indrakeeladri Kanaka Durga Temple
Rajashekher G
|

Updated on: Oct 13, 2026 | 9:46 AM

Share

Indrakeeladri Kanaka Durga Temple: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో కృష్ణానది తీరాన వెలసిన ఇంద్రకీలాద్రి పర్వతం శరన్నవరాత్రుల వేళ భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, భక్తులను కరుణించే చల్లని దైవంగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. అయితే ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఎలా వెలిశారు? ఆ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? కనకదుర్గమ్మగా పూజలు అందుకోవడం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది?

ఆలయ స్థలపురాణం ప్రకారం, పూర్వం కీలుడు అనే యక్షుడు దుర్గాదేవి కోసం ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగింది. అప్పుడు కీలుడు తన హృదయంలో అమ్మవారు శాశ్వతంగా నివసించాలని కోరుకున్నాడు. అందుకు అంగీకరించిన దేవి, కీలుడిని పర్వతంగా మారి తన కోసం ఎదురుచూడమని చెప్పింది. తాను రాక్షస సంహారం చేసిన అనంతరం ఆ పర్వతంపై వెలుస్తానని వరమిచ్చింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం కీలుడు పర్వతంగా మారి దేవి రాక కోసం ఎదురుచూశాడు. అనంతరం మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి కీలాద్రిపై వెలసినట్లు స్థలపురాణం చెబుతుంది. ఇంద్రుడు సహా దేవతలందరూ అమ్మవారిని దర్శించుకుని పూజించేందుకు ఇక్కడికి వచ్చేవారని ప్రతీతి. దీంతో కీలాద్రికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చిందని భక్తులు విశ్వసిస్తారు.

కనకదుర్గమ్మగా పేరు రావడం వెనుక కథ ఇదే!

విజయవాడ అమ్మవారిని మహిషాసురమర్దినిగా కూడా పూజిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించిన దేవి దుర్గామాతగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారు బంగారు కాంతులతో ప్రకాశిస్తూ దర్శనమివ్వడం వల్ల కనకదుర్గగా పూజలు అందుకుంటున్నారని భక్తుల విశ్వాసం. మరో పౌరాణిక కథనం ప్రకారం, విజయవాటికను పాలించిన మాధవవర్మ అనే రాజు ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఒకసారి అతని కుమారుడి రథం కింద పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. న్యాయం కోసం బాలుడి తల్లిదండ్రులు రాజును ఆశ్రయించారు. తన కుమారుడే తప్పు చేసినందున మాధవవర్మ అతనికి మరణశిక్ష విధించినట్లు కథనం చెబుతుంది. రాజు ధర్మనిష్ఠకు మెచ్చిన అమ్మవారు మరణించిన బాలుడిని తిరిగి బతికించడంతో పాటు బంగారు వర్షం కురిపించిందని పురాణగాథ ప్రచారంలో ఉంది. ఈ కథతో అమ్మవారికి కనకదుర్గ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

అష్టభుజాలతో దర్శనమిచ్చే అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ భక్తులకు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారు. ఎనిమిది చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి, మహిషాసురుడిని సంహరిస్తున్న భంగిమలో అమ్మవారి మూర్తి భక్తులను ఆకట్టుకుంటుంది. దుర్గమ్మను దర్శించుకుంటే ధైర్యం, శక్తి, మనశ్శాంతి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

శరన్నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు

శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ అలంకారాల్లో పూజిస్తారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో విశేష పూజలు, కుంకుమార్చనలు జరుగుతాయి. విజయదశమి రోజున రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించడం ఉత్సవాల్లో మరో విశేషం.

భవానీ దీక్ష చేపట్టిన భక్తులు ఇరుముడులతో ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారి సన్నిధిలో దీక్ష విరమిస్తారు. ఇలా పౌరాణిక విశిష్టత, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన ఇంద్రకీలాద్రి క్షేత్రం శరన్నవరాత్రుల్లో భక్తి పారవశ్యంతో కళకళలాడుతుంది. ఆ జగన్మాత అనుగ్రహం అందరికీ కలగాలని భక్తులు ప్రార్థిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పౌరాణిక గాథలు, స్థలపురాణ విశేషాలు భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే పరిగణించగలరు.)

ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి మహోత్సవాలు వీడియో..

Follow Us