Indian railways: రైలు ప్రయాణంలో సమస్యలా? దీనికి పరిష్కారం ‘రైల్ మదద్’ యాప్. భారతీయ రైల్వేకు సాంకేతిక సహకారం అందించే సంస్థ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తయారు చేసిన యాప్ ఇది. యాప్ మాత్రమే కాదు… ‘రైల్ మదద్’ పోర్టల్ కూడా ఉంది. ప్రయాణికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ‘రైల్ మదద్’ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది భారతీయ రైల్వే. ప్రయాణికులు రైల్వేకు సంబంధించి ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా ‘రైల్ మదద్’ ప్లాట్‌ఫామ్‌లో కంప్లైంట్ చేయొచ్చు.
అంతేకాకుండా… తమ కంప్లైంట్లకు సంబంధించిన స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణం, సరుకు రవాణా, పార్శిల్ డెలివరీ లాంటి సమస్యలకు కూడా ఈ యాప్‌లో కంప్లైంట్స్ స్వీకరిస్తుంది రైల్వే. రైల్వేకు సంబంధించి ఏ సమస్యకైనా https://railmadad.indianrailways.gov.in/ వెబ్‌సైట్ లేదా ‘రైల్ మదద్’ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ‘రైల్ మదద్’ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. ఈ యాప్ 12 భాషల్లో సేవల్ని అందిస్తుంది. ఇందులో కంప్లైంట్ ఇవ్వడం పెద్ద సమస్యేమీ కాదు. మీరు ‘రైల్ మదద్’ ప్లాట్‌ఫామ్ ఉపయోగించాలంటే ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి.
అయితే.. మీ దగ్గర పీఎన్ఆర్ నెంబర్ ఉంటే వెల్లడించాలి. మీ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అప్‌లోడ్ చేయొచ్చు. ఫిర్యాదు నేరుగా ఫీల్డ్ యూనిట్‌కు వెళ్తుంది. ప్రతీ కంప్లైంట్‌కు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్‌తో మీ కంప్లైంట్ స్టేటస్, ఫీడ్ బ్యాక్ తెలుసుకోవచ్చు. రైల్వే సిబ్బంది వీలైనంత త్వరగా మీ సమస్యను పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారం కాగానే మీకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ వస్తాయి.