దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలను కల్పించాలనే దృక్పథంతో మొదటగా ఎంపిక చేసిన 190 రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా అత్యాధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ పేర్కొన్నారు.
జనాభా ప్రాతిపదికన, పర్యాటకం, ఆధ్యాత్మికం ఇలా అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం దేశవ్యాప్తంగా 190 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఎంపిక చేసిన వాటిలో ఇప్పటికే 100 రైల్వే స్టేషన్లలో నూతన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. మిగతా స్టేషన్లలో కూడా పనులు వేగంగా నడుస్తున్నాయని, ఏప్రిల్ 2019 నాటికల్లా పనులు పూర్తి చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఇప్పటికే దేశంలోని మథుర, జయపుర, న్యూ ఢిల్లీ, సాయినగర్ షిర్డీ స్టేషన్, లోనావాలా జంక్షన్లలో రైల్వే శాఖ ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పిస్తూ వాటిని అద్భుతంగా తీర్చిదిద్దింది. మరోవైపు కొండ ప్రాంతాల రైలు మార్గాల్లో ప్రకృతిని వీక్షించేందుకు విస్టాడోమ్ కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైల్వే శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో వీటితోపాటుగా అదనంగా మరో 500 రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ సంఖ్య 690కి చేరనుంది. అన్ని రకాల సదుపాయాలను కల్పించడమే ధ్యేయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 68 రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలను కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.