అలాంటి సినిమాలు తీసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా…

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2020 | 12:23 PM

తమిళనాడులోని తూత్తుకూడి, సాతాంకుళంలో జరిగిన తండ్రి కొడుకుల లాకప్‌డెత్‌ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపడమే కాదు.. ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.

అలాంటి సినిమాలు తీసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా...
Follow us on

తమిళనాడులోని తూత్తుకూడి, సాతాంకుళంలో జరిగిన తండ్రి కొడుకుల లాకప్‌డెత్‌ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపడమే కాదు.. ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.. జయరాజ్‌, బెన్నిక్స్‌ దారుణహత్యకు గురయ్యారన్న పచ్చి నిజం తూత్తుకూడి పోలీసులపై ఏహ్యభావాన్ని కలిగిస్తోంది.. ప్రముఖ తమిళ దర్శకుడు హరి గోపాలకృష్ణన్‌ అయితే పోలీసుల ధీరోదాత్తతపై ఎలాంటి సినిమాలు తీయబోనని ప్రతినకూడా బూనాడు.. ఇప్పటి వరకు హరి పోలీసుల ధైర్యసాహసాలను హైలైట్‌ చేస్తూ సినిమాలు తీస్తూ వచ్చారు.

సింగం, సింగం-2, సామి, సామి-2 సినిమాలు హరి దర్శకత్వంలో వచ్చినవే! ఇక మీదట ఇలాంటి సినిమాలు తీయనని ప్రకటించిన హరి ఇలాంటి సంఘటనలు తమిళనాడులో మళ్లీ జరగకూడదన్నారు. కొందరు అధికారుల కారణంగా మొత్తం పోలీసుశాఖ ప్రతిష్ట దిగజారిపోతున్నదని ఆవేదన చెందారు హరి. పోలీసులను గొప్పగా చూపిస్తూ అయిదు సినిమాలు చేసినందుకు ఇప్పుడు చింతిస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే పోలీసు కస్టడీలో తండ్రికొడుకులు చనిపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమిళ సినీ పరిశ్రమ కూడా ఘటనపై తీవ్రంగా స్పందించింది.

బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఈ సంఘటనను వ్యవస్థీకృత నేరంగా పేర్కొన్నారు సింగం సిరీస్‌ హీర్‌ సూర్య.. జరిగిన ఘటనపై విచారణ చేపట్టి, దోషులను కఠినాతికఠినంగా శిక్షించాలన్నారు నటి ఖుష్బూ… ఇంత అమానవీయంగా ప్రవర్తించిన పోలీసులను తిట్టిపోశారు సంగీత దర్శకుడు డి.ఇమ్మన్‌. పోలీసుల క్రూరత్వానికి మరో ప్రాణం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మన మీద ఉందన్నారు ప్రముఖ దర్శకుడు పా రంజిత్‌. సమంతా, కాజల్ అగర్వాల్, హన్సిక, హీరో విష్ణు విశాల్ కూడా పోలీసుల దాష్టికాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు.. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు.