1991లో కేసు.. 35 ఏళ్లుగా పరారీ! పెయింటర్‌గా మారిన రౌడీ షీటర్‌ను చివరకు ఎలా పట్టుకున్నారంటే?
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో 35 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగిన రౌడీ షీటర్ ఇల్యాస్ బిన్ హుస్సేన్ యాఫైని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1991లో హత్యాయత్నం కేసులో ఇతడిపై రౌడీ షీట్ నమోదైంది. పెయింటర్‌గా వేర్వేరు రాష్ట్రాల్లో దాక్కున్న ఇల్యాస్‌ను చార్మినార్ టాస్క్‌ఫోర్స్ బృందం చాకచక్యంగా పట్టుకుంది. ఈ అరెస్ట్ పాతబస్తీ పోలీసింగ్‌లో చర్చనీయాంశమైంది.

హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులకు చిక్కకుండా ఏకంగా 35 ఏళ్ల పాటు తప్పించుకు తిరిగిన ఓ రౌడీ షీటర్‌ను చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 1991లో రౌడీ షీట్ ఓపెన్ అయింది నాటి నుంచి పోలీసుల రికార్డుల్లో ఉన్నప్పటికీ.. ఇన్నేళ్లుగా అతడు పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ వచ్చాడు. చివరకు పెయింటర్ అవతారం ఎత్తి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న అతడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు
పోలీసుల వివరాల ప్రకారం.. బర్కాస్‌లోని సలాలాకు చెందిన 54 ఏళ్ల ఇల్యాస్ బిన్ హుస్సేన్ యాఫై 1991లో చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు నేపథ్యంలో అతడిపై చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ తెరిచారు. అయితే రౌడీ షీట్ తెరిచిన తర్వాత ఇల్యాస్ పోలీసులకు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అతడి పేరు పోలీసుల రికార్డుల్లో ‘అవుట్ ఆఫ్ వ్యూ’ రౌడీ షీటర్‌గా కొనసాగింది.
విదేశాలకు వెళ్లి.. తిరిగి వచ్చాక ప్లాన్ మార్చి..
పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి కోసం ఇల్యాస్ విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. భారత్‌కు తిరిగి వచ్చిన అతడు.. తనపై పోలీసుల నిఘా ఉందనే కారణంతో ఒకే ప్రాంతంలో ఎక్కువకాలం ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. పెయింటింగ్ పనిని వృత్తిగా ఎంచుకుని వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ జీవనం సాగించినట్లు పోలీసులు తెలిపారు.
ఇలా 35 ఏళ్ల పాటు పోలీసుల కళ్లకు చిక్కకుండా జీవించిన ఇల్యాస్.. చివరకు హైదరాబాద్‌కు వచ్చినట్లు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో అతడి కదలికలపై నిఘా పెట్టిన చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం.. సెప్టెంబర్ 28న అతడిని అరెస్ట్ చేశారు.
1991 నుంచి కొనసాగుతున్న రౌడీ షీట్.. 35 ఏళ్ల తర్వాత అరెస్ట్
1991లో హత్యాయత్నం కేసు.. ఆ తర్వాత రౌడీ షీట్.. అక్కడి నుంచి ‘అవుట్ ఆఫ్ వ్యూ’.. ఇలా పోలీసుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత పోలీసులకు చిక్కడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 54 ఏళ్ల వయస్సులోనూ పెయింటర్‌గా పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న ఇల్యాస్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు
ఈ ఆపరేషన్ చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్. సైదాబాబు పర్యవేక్షణలో జరిగింది. ఎస్సైలు కె. రామారావు, ఎం. మహేష్, ఎం. మధు, పీసీ టి. ప్రశాంత్‌తో పాటు చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం, చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి ఈ చర్య చేపట్టారు. 35 ఏళ్లుగా కనిపించకుండా ఉన్న రౌడీ షీటర్.. చివరకు టాస్క్‌ఫోర్స్ నిఘాకు చిక్కడం పాతబస్తీ పోలీసింగ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
