గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తెరుచుకోనుంది. కొవిడ్ కారణంగా మూతపడిన ఈ పండ్ల మార్కెట్ త్వరలోనే తెరుచుకోనుంది. గత నెల 12న మూసివేసిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ఎట్టకేళకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది.
కరోనా కారణంగా మూసివేయడం వల్ల గత 45 రోజులుగా వస్తున్న విమర్శలకు తావీయకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ ఛైర్మన్ వీరమల్లు రామనర్సయ్యగౌడ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ప్రవీణ్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డును రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడకు తరలింపు అంశంపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కమిటీ సభ్యులు సమావేశం కావడంతో.. మార్కెటింగ్ శాఖ, కమీషన్ ఏజెంట్లు, హమాలీ వర్గాలు, రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని కొహెడకు వెళ్లబోమని తెగేసి చెప్పిన వ్యాపారులు.. ఇప్పటి వరకు రోడ్లపైనే తమ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. రైతులు తమ పండ్ల ఉత్పత్తులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై వాడివేడిగా చర్చించిన అనంతరం పండ్ల మార్కెట్ పునఃప్రారంభంపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు.