బ్యాంకుల ఎగవేత కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అక్రమార్కలకు పాల్పడ్డారన్న నేపథ్యంలో ఐవీఆర్‌సీఎల్ సంస్థపై కేసు నమోదు చేసిన సీబీఐ.. నిందితుల జాబితాలో ఎండీ సుధీర్ రెడ్డి, జేఎండీ బలరామి రెడ్డి సహా పలువురి పేర్లను చేర్చింది. ఐవీఆర్‌సీఎల్ సంస్థ పేరుతో రూ. 4,837కోట్ల మేర బ్యాంకులను మోసగించినట్టు ఫిర్యాదు అందించింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు స్వీకరించిన సీబీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా, సంస్థ ఎలాంటి ఆధారాలు లేని లావాదేవీలతో నిధులను దారిమళ్లించినట్టు తేల్చిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టును రూపొందించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయం, నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ఐవీఆర్సీఎల్ సంస్థ కన్సార్షియం నుంచి రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మోసగించినట్టు ఎస్‌బీఐ అభియోగాలు మోపింది. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు.