400 ఏళ్లనాటి చరిత్ర.. ఏడుకొండలవాడికి ‘ఎరువాడ జోడు పంచెలు’

గద్వాల సంస్థాన నల్ల సోమనాథ్‌ భూపాల్‌ కాలం నుంచి నేటి వరకు ఈ పంచెలను అందిస్తూ వస్తున్నారు. స్వామివారికి ఆ జోడుపంచెలను ఇవ్వడం వెనుక 400 ఏళ్ల చరిత్ర ఉంది...

400 ఏళ్లనాటి చరిత్ర.. ఏడుకొండలవాడికి 'ఎరువాడ జోడు పంచెలు'
Follow us

|

Updated on: Aug 20, 2020 | 8:04 PM

ప్రతీ ఏటా జరిగే దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు.. ఎరువాడ జోడు పంచెలను ఏడుకొండలవాడికి అందించడం ఆనవాయితీగా వస్తోంది. గద్వాల సంస్థాన నల్ల సోమనాథ్‌ భూపాల్‌ కాలం నుంచి నేటి వరకు ఈ పంచెలను అందిస్తూ వస్తున్నారు. స్వామివారికి ఆ జోడుపంచెలను ఇవ్వడం వెనుక 400 ఏళ్ల చరిత్ర ఉంది.

శ్రావణమాసంలో పని ప్రారంభించి 41 రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో ఈ పంచెను నేస్తారు. ఉపవాసాలు, గోవిందనామ స్మరణతో మగ్గం చేస్తుంటారు. ఎరువాడ పంచె సుమారు 11 గజాల పొడవు, 85 ఇంచుల అంచు, 3 గజాల వెడల్పు ఉంటుంది. ఈ పంచెలపై రాజా కట్టడాలకు గుర్తుగా 8 కంచుకోట కొమ్మ నగిషీతో సుందరంగ, కళాత్మకంగా తయారు చేస్తారు. పంచెతయారీకి 20 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా పనులు సాగవు, మగ్గం కదలదన్న కారణంతో… అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.

గద్వాల్‌ నగరం తుంగభద్ర, కృష్ణా నది మధ్యన ఉన్నందున ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రెండు నదుల మధ్య ఉండే గద్వాల్‌లోని చేనేత మగ్గాలపై ఈ జోడు పంచెలను తయారు చేస్తారు. అలా రెండు ఏరువాడల మధ్యలో తయారయ్యే వీటిని ఎరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి కెక్కినట్టుగా చెబుతుంటారు. సహజంగా నేత మగ్గంలను ఇద్దరు కలిసి నేస్తారు. కానీ ఈ మగ్గం ప్రత్యేకత ఏంటంటే ముగ్గురు ఒకేసారి నేసేలా ఉంటుంది. దీనిని నామాల మగ్గం అంటారు. ఎరువాడ జోడు పంచెల తయారీకి మండలకాలం పడుతుందని కాబట్టి.. దీన్ని ప్రత్యేకంగా చేయిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి శ్రీవారికి ఎన్నో కానుకలు అందుతుంటాయి. కానీ గద్వాల నుంచి వచ్చే జోడుపంచెలు.. వాటన్నిటిలో ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. పంచెలను తయారు చేయడం తమ పుణ్యఫలంగా ఇక్కడి వారు కొలుస్తారు. గద్వాల సంస్థానాదీశుల తరపున మహంకాళి కరుణాకర్‌ కొన్నేళ్లుగా తన ఇంట్లో ఈ ఎరువాడ జోడు పంచెలను తయారు చేయిస్తున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజున శ్రీవారి మూల విరాట్‌ విగ్రహానికి ఎరువాడ జోడుపంచెలను అలంకరిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో గతంలో మాదిరిగా హడావుడి లేకుండా పోయింది. భౌతికదూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పంచెలు నేస్తున్నారు. అయినా కరోనా మహమ్మారి మూలంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ ఇంతకుముందు జరిగినట్టుగా కన్నుల పండువగా ఉంటుందో… ఉండదోనన్న టెన్షన్‌ కొనసాగుతోంది.