జీడిగుంట రామచంద్రమూర్తి. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. కథ, నవల, నాటకం, వ్యాసం, ప్రసారమాధ్యమ రచన వంటి ప్రక్రియల్లో ఆయనది అందెవేసిన చేయి. అలాంటి వ్యక్తి ఇక సెలవంటూ అనంతలోకాలకు తరలివెళ్లిపోయారు. హీరో వరుణ్ సందేశ్ కు తాతగారైన రామచంద్రమూర్తి కొవిడ్ మహమ్మారి కారణంగా తనువుచాలించారు. రామచంద్రమూర్తి కుమారుడు జీడిగుంట శ్రీధర్ కూడా కొన్ని సినిమాల్లోనూ.. చాలా సీరియళ్లలోనూ నటించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనకు కరోనా కూడా సోకడంతో కోలుకోలేకపోయారు. రామచంద్రమూర్తి మృతికి పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. ఆయన కవితాలోకానికి చేసిన సేవల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నారు. సాహిత్యరంగానికి ఆయన చేసిన విశిష్టసేవలను ఈ సందర్భంగా మననం చేసుకుంటున్నారు. 1940లో జన్మించిన జీడిగుంట రామచంద్రమూర్తి 19ఏళ్ల వయస్సులో వరంగల్‌లో సహకార బ్యాంకులో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కొంతకాలం విద్యాశాఖలో పనిచేసి అనంతరం 1971లో హైదరాబాద్ ఆకాశవాణిలో చేరి పూర్తిస్థాయి రచయితగా, రేడియో కళాకారుడిగా కొనసాగారు. 1960లో ఆయన కలంనుంచి జాలువారిన ‘హంసగమన’ అనే తొలి కథ ప్రచురితమయ్యింది. ఇలా దాదాపు 300కథలు, 40 నాటక నాటికలు, 8 నవలలు, రేడియో, టెలివిజన్, సినిమా మాధ్యమాల్లో అనేక రచనలు ప్రచురితం, ప్రసారం అయ్యాయి.