భాగ్యనగరానికి మణిహారమైన హుస్సేన్ సాగర్ ఇప్పుడు డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, గత రాత్రికే 514.10 మీటర్లకు చేరిపోయింది. దీంతో నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు అధికారులు. చాలా ఏళ్ల తరువాత ఇంత నీటిని చూస్తున్నాం అంటున్నారు స్థానికులు, ఇక్కడ పని చేసే కూలీలు. 116 ఏళ్ల చరిత్రలో హైదరాబాద్ లో ఇంతస్థాయి వర్షం లేదన్నది వాతావరణశాఖ అధికారుల మాట.