మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. అస్తి కోసం రక్త సంబంధీకులనే కాదనుకుంటున్నారు. చిన్న కొడుకుకి దక్కాల్సిన భూమి వాటాపై ప్రశ్నినందుకు కన్న తల్లినే చితకబాదాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం సీతారాంపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది.
సీతారాంపూర్ గ్రామానికి చెందిన నల్లెల సూరయ్య, సుశీలకు ముగ్గురు సంతానం. వారికి ఉన్న 7.28 ఎకరాల భూమిలో కూతురుకు ఎకరం రాసిచ్చారు. తల్లి సుశీల పేరుపై ఎకరం ఉంది. మిగిలిన భూమిని ఇద్దరు కుమారులు సమానంగా పంచుకోవాల్సి ఉండగా పెద్ద కుమారుడు నల్లెల రవీందర్ ఎక్కువ తీసుకున్నాడు. దీంతో చిన్న కుమారుడైన శ్రీధర్ తన వాటాకు రావాల్సిన మిగతా భూమి కోసం అన్నతో గొడవకు దిగాడు. అయితే, చిన్న కుమారుడికి అన్యాయం జరిగిందని గ్రహించిన తల్లి సుశీల అతనికి అండగా నిలిచింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న రవీందర్ పత్తి చేను వద్ద పనిచేస్తున్న తల్లిపై భార్యతో కలిసి దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో వృద్ధురాలి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్న కుమారుడు శ్రీధర్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. కాగా, దాడికి సంబంధించిన వీడియోతో పరకాల ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలితోపాటు శ్రీధర్ తెలిపారు. తల్లిపై దాడికి పాల్పడ్డ రవీందర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.