తన దూకుడు ప్రవర్తనతో గుర్తింపు పొంది.. అనతి కాలంలోనే సీఐ నుండి ఎంపీగా ఎదిగిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. మరోసారి తన నోటికి పని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, దివంగత నేత పరిటాల రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ కేసు నుండి తప్పించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. అంతేకాదు.. ఆ కేసు నుండి తప్పించుకోవడం కోసం 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుండి చంద్రబాబు పారిపోయి కృష్ణా జిల్లాలోని కరకట్టకు వచ్చారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు జడ్జి పదవులు ఇవ్వరాదని, జడ్జిలకు బీసీలు పనికిరారని గతంలో చంద్రబాబు అన్నారని మాధవ్ పేర్కొన్నారు. అంతేకాదు.. వ్యవసాయం దండగ అని కూడా అన్నారంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
ఇదే సమయంలో దివంగత నేత పరిటాల రవిపైనా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ మాధవ్. అప్పట్లో చంద్రబాబు అండ చూసుకుని పరిటాల రవి రెచ్చిపోయారని అన్నారు. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపు టేర్లు పారించి పొలాలను తడిపారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రవి అక్రమాలకు చంద్రబాబు బాటసగా నిలిచేవారంటూ మాధవ్ పేర్కొన్నారు.