Good News To Farmers : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నుంచి రైతులకు దేశ వ్యాప్తంగా ఇచ్చే రుణాల పరిమితి పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 7 శాతం వడ్డీ చెల్లిస్తూ గరిష్ఠంగా మూడు లక్షల వరకు..షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె..రైతుల ఆదాయాన్ని 2022కు రెట్టింపు చేసే దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో భాగంగానే కేవలం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం రూ. 1.6 లక్షల కోట్లు కేటాయింపులు జరిపినట్టు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వినతుల కారణంగా అన్నదాతల రుణ పరిమితిని పెంచినట్లు తెలిపిన ఆమె..గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అందే రుణాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఒక్క పీఎం కిసాన్ పథకానికి రూ.75వేల కోట్లు కేటాయించామని..రైతులు ఆనందమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లోన్స్ టార్గెట్ రూ. 13.5 లక్షలు కోట్లు ఉందని పేర్కొన్నారు. 2021 లోగా దీన్ని రూ. 15 లక్షల కోట్లకి చేర్చడానికి ప్రయత్నిస్తామన్నారు. మూములుగా ప్రతి ఏడాది రుణ లక్ష్యాన్ని 9 శాతం మాత్రమే పెంచుతారని, కానీ ఎన్డీఏ ప్రభత్వం మాత్రం 11 శాతం పెంచినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు.