Goddess Sita Birthplace: ఆదర్శపత్ని సీతమ్మ పూర్వీకులు.. పుట్టిల్లు.. తనువు చాలించిన ప్రాంతాల గురించి తెలుసుకుందాం..

|

Jan 20, 2021 | 6:33 PM

హిందువుల జీవితాల్లో రామాయణ, మహాభారత గ్రంథాలకు విశిష్ట స్థానం ఉంది. రామాయణంలోని సీతాదేవి పాత్ర ఒక ఆదర్శనీయమైన భార్యకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వాల్మీకి రామాయణం ప్రకారం,...

Goddess Sita Birthplace: ఆదర్శపత్ని సీతమ్మ పూర్వీకులు.. పుట్టిల్లు.. తనువు చాలించిన ప్రాంతాల గురించి తెలుసుకుందాం..
Follow us on

Goddess Sita Birthplace:  హిందువుల జీవితాల్లో రామాయణ, మహాభారత గ్రంథాలకు విశిష్ట స్థానం ఉంది. రామాయణంలోని సీతాదేవి పాత్ర ఒక ఆదర్శనీయమైన భార్యకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వాల్మీకి రామాయణం ప్రకారం, ఆమె మిధిలానగర మహారాజు జనకుని దత్త పుత్రిక. కానీ రామాయణం ఒక్క రచనతో ఆగలేదు. గోస్వామి తులసిదాస్ ఈ ఇతిహాసాన్ని తిరిగి వ్రాసారు, భారతదేశంలోని హిందువులు అనుసరిస్తున్న రామాయణం ఇదే. యుగాలు మారినా సీతారాములను ఆదర్శ దంపతులుగా చెప్పుకుంటారు. ఆలూమగల అనురాగానికి ఈ జంట అన్ని కాలాల్లోనూ ప్రతీకగా నిలిచింది. మరి అటువంటి ఆదర్శ పత్ని సీతమ్మ పూర్వికులు… పుట్టిల్లు… తనువు చాలించిన ప్రాంతాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

నిమి సీతాదేవి వంశ మూల పురుషుడు ఈయన కొడుకు మిధి. మిధి కుమారుడు జనకుడు. ఈ వంశమునందే కీర్తి రాతుడు.. మహ రోముడు ప్రభవించారు. మహ రోమునికి స్వర్ణ రోముడు… స్వర్ణ రోమునికి.. హ్రస్వ రోముడు జన్మించారు. ఈ హ్రస్వ రోముని సంతానం జనకుడు, కుశె ధ్వజుడులు. జనకుని అసలు పేరు సిరధ్వజుడు. హ్రస్వ రోముడు జనకునికి పట్టాభిషేకం చేసి వానప్రస్థం తీసుకుని అడవులకు వెళ్ళాడు. జనకుని దత్తత పుత్రిక సీతమ్మ కాగా.. సొంత కుమార్తె ఊర్మిళ. జనకుని తమ్ముడు కుశె ధ్వజునికి మాండవి శృత కీర్తి అను కుమార్తెలున్నారు.

నేపాల్‌లో ఉన్న జనక్ పూర్‌నే జనక్ పూర్ ధామ్ అని పిలుస్తారు. ఖట్మాండుకు నైరుతి దిశగా 123 కీ. మీ. దూరంలో ఈ పట్టణం ఉంది. ఈ పట్టణాన్ని సీతమ్మ జన్మ స్థలంగా విశ్వసిస్తారు. ఇందుకు సంబంధించిన స్థల పురాణం రామాయణంలో ఉంది. జనకుడు ప్రస్తుత నేపాల్ లోని విదేహ రాజ్యాన్ని.. పాలిస్తున్న సమయంలో సీతమ్మ భూమిని దున్నినప్పుడు నాగలికి తగిలి జనకుడికి దొరికిందన్న విషయం అందరికీ తెలిసిందే. జనక్ పూర్ లోనే సీతమ్మ కు శ్రీ రామునికి వివాహం జరిగింది. అప్పటి నుంచి జనక్ పూర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది.

ఇక సీతమ్మ తల్లి తన అవతారం చాలించినప్పుడు తన మాతృ మూర్తి అయిన భూ మాతలో ఐక్యం అయ్యింది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఆ ప్రదేశం ఎక్కడ ఉందనేది అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ పవిత్ర స్థలం అలహాబాద్ వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికీ 4 కి మీ దూరంలో ఉంటుంది. రెండవ జాతీయ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని “సీత సమాహిత్ స్థల్” అని ‘సీత మారి’ అని పిలుస్తారు. తమసా నది పరిసరాల్లో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఉంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని స్థానికులు చెబుతారు. ఆప్రాంతంలో మొలిచిన గడ్డి ని పశువులు తినేవి కాదట. సీతా కేశ వాటికను చెక్కుచెదరకుండా స్మారకం నిర్మించారు. ఆ ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. పక్కనే లవ కుశలకు జన్మ నిచ్చిన స్థలమైన సీత వటవృక్షం కూడ ఉంది.

ఇక సీతమ్మ స్మారకం రెండు అంతస్థుల భవన నిర్మాణం.. రెండో అంతస్థులో అద్దాల మంటపంలో అమ్మ వారి పాల రాతి విగ్రహం, కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమ ఉంటుంది. సీతమ్మ తన కన్నతల్లి భూదేవి ఒడిలోకి చేరుతున్న దృశ్యం కళ్ళకు కట్టినట్లు ఉండి ఎంతటి వారికైన బాధ కలిగిస్తుందని భక్తులు చెబుతారు. ఈ క్షేత్రంలో సీతమ్మ తో పాటు శివుని విగ్రహంతో పాటు.. 20 అడుగుల కృత్రిమ రాతిపై నిర్మించిన 108 అడుగుల హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. ఈ రాతి నిర్మాణం కింద గుహలో చిన్న హనుమన్ దేవాలయం ఉంటుంది.

రామాయణంలో ప్రముఖ పాత్ర సీతమ్మదే.. ఆమె లేకుంటే అసలు రామాయణమే లేదు. అందుకే, వాల్మీకి ‘కావ్యం రామాయణం కృత్స్నం సీతా యాశ్చరితం మహత్‌’ అన్నారు. సీత మృదు స్వభావం, ఆత్మబలిదానం, పాతివ్రత్యం నేటి సమాజానికి ఎన్నో గొప్ప విషయాలను తెలియజేస్తుంది. ఆదర్శ పత్నిగా నిలిచింది.

Also Read: ఇన్వెస్ట్‌మెంట్‌కు తగిన రాబడినిచ్చే పోస్టాఫీస్‌లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..