గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను ఎర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష నిర్వహించారు. లెక్కింపు సమయంలో అనుసరించిన పద్దతులపై కౌటింగ్ రిటర్నింగ్ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలపై రిటర్నింగ్ అధికారికే సంపూర్ణ అధికారం ఉంటుందని కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు రెండు దశల్లో ఉంటుందని ఎస్ఈసీ చెప్పారు. మొదటి దశలో బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను మడత విప్పకుండా లెక్కించి కట్ట కడుతారని తెలిపారు. ఆ తరువాత రెండో దశలో ఆ బండిళ్లను అభ్యర్థి వారీగా లెక్కిస్తారని వెల్లడించారు. బ్యాలెట్ పేపర్లపై ఏమాత్రం అనుమానాలు ఉన్న వాటిపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని చెప్పారు. సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్‌లకు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఎవరికి కేటాయించిన టేబుళ్ల వద్ద వారే కూర్చునేలా చూడాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించడానికి 30 డీఆర్‌సీ కేంద్రాలకు 30 పరిశీలకులను నియమించామని, వారి ఆమోదం పొందాకే ఆర్వో ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని స్పష్టంచేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 1,926 పోస్టల్ బ్యాలెట్‌లను జారీ చేశామని ఆయన తెలిపారు. కౌంటింగ్‌లో భాగంగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపును రిటర్నింగ్ అధికారి టేబుల్ దగ్గర, ఆ తరువాత ఇతర బ్యాలెట్ పేపర్ల లెక్కింపును 8.10కి కౌంటింగ్ టేబుళ్ల దగ్గర మొదలు పెట్టాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు కోసం 30 సెంటర్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.