Coronavirus: గత ఏడాదికి పైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు సైతం అనేకమైన చర్యలు చేపట్టినా.. రకరకాలుగా రూపాంతరం చెందుతూ ప్రాణాలను తీస్తోంది. అయితే ఈ వైరస్ ఎక్కడి నుంచి పుట్టిందనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు పూర్తి ఆధారాలు మాత్రం లభించలేదు. ఇక చైనాలోని వుహన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అమెరికాతో పాటు ఇతర దేశాలు సైతం ఆరోపణలు గుప్పించాయి. ఇక కోవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్ చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో తయారైందని చెప్పేందుకు ప్రస్తుతానికి శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి స్పష్టం చేసింది.
జంతువుల నుంచే అది మనుషుల్లోకి ప్రవేశించి ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు కరోనా ఎక్కడ పుట్టిందనే దానిపై ఇప్పటి వరకు లభించిన శాస్త్రీయ ఆధారాలన్నింటినీ ఆస్త్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌లోని ఎడిన్‌బరో యూనివర్సిటీ, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, చైనాలోని జియావోటాంగ్-లివర్‌పూల్ యూనివర్సిటీ సహా ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు, పరిశోధక సంస్థలకు చెందిన 21 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు క్షుణ్ణంగాపరిశీలించారు. కరోనా వైరస్ ప్రయోగశాలలో అనుకోకుండా ఆవిర్భవించి ఉండొచ్చన్న వాదనను పూర్తిగా తోసిపుచ్చలేమని వారు పేర్కొన్నారు. అయితే ల్యాబ్ నుంచే అది లీక్ అయ్యిందని చెప్పే ఆధారాలు కూడా ప్రస్తుతానికి లేవని స్పష్టం చేశారు. మహమ్మారి తొలినాళ్లలో నమోదైన కేసులకు, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ)కి మధ్య సంబంధాలేవీ కనిపించలేదని స్పష్టం చేశారు. జంతువుల నుంచి మానవుల్లోకి వైరస్ ప్రవేశించిందన్న వాదనను బలపర్చేలా మాత్రం తగినన్ని శాస్త్రీయ ఆధారాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా, ఇప్పటికే వైరస్ ఏడాదికిపైగా విజృంభిస్తుండగా, వివిధ వేరియంట్లలో వ్యాప్తి చెందుతూ ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్‌తో పాటు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో బృందం కూడా వుహాన్ నగరాన్ని సందర్శించి వైరస్ వ్యాప్తిపై దర్యాప్తు చేపట్టింది. పలు ఆస్పత్రులు, వైరాలజీ ల్యాబ్‌ను సైతం పరిశీలించింది. అయినా వైరస్ పుట్టికపై పూర్తి ఆధారాలు లభించడం లేదు.